వైద్య కళాశాలలపై సిఎంకు ప్రజారోగ్య వేదిక లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వ,ప్రైవేట్ భాగస్వామ్యం(పిపిపి) విధానంలో తీసుకురావాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రజారోగ్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎంవి రమణయ్య, టి కామేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆదివారం లేఖ రాశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన 17 వైద్య కళాశాలల్లో 10 కళాశాలలను పిపిపి విధానంలోకి మార్చడం, ఇదే విధానం ద్వారా కొత్త కళాశాలలను స్థాపించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ప్రజలకు వైద్యం అందించడం, ఆరోగ్యాన్ని సంరక్షించడం ప్రభుత్వ అత్యున్నత బాధ్యత అని తాము గట్టిగా విశ్వసిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో ముఖ్యమైన వైద్య విద్యను పిపిపి నమూనా ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య లభ్యత, వైద్య ఖర్చులను భరించగలిగే సామర్ధ్యం, ప్రాథమిక హక్కు గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ ప్రతిపాదనను పున:పరిశీలించాలని కోరారు. వైద్య కళాశాలల్లో స్వయం ఆర్ధిక సీట్లను ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షంలో ఉండగా టిడిపి వ్యతిరేకించిందని, ఈ విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు ఆ వాగ్దానాలకు, ప్రజల ఆశలకు విరుద్ధంగా పిపిపి పేరుతో ప్రయివేటుపరం చేయడం సమంజసం కాదన్నారు. స్వయం ఆర్ధిక సీట్ల విధానాన్ని రద్దు చేయాలని గత ప్రభుత్వానికి కూడా తాము వినతిపత్రం అందించామని పేర్కొన్నారు. ప్రజల ఆర్ధిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ సమానమైన వైద్య అందించాలన్నా, వైద్య సేవల వాణిజ్యకరణను నిరోధించాలన్నా ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలని తెలిపారు. వైద్య విద్యలో పిపిపి అమలు వల్ల వైద్య విద్య ఖర్చులు విపరీతంగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
