- యుటిఎఫ్ పోరుబాటలో రాష్ట్ర నేతలు, పిడిఎఫ్ ఎమ్మెల్సీలు
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి : విద్యారంగంలో నానాటికీ పేరుకుపోతున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు, యుటిఎఫ్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ చేపట్టిన పోరుబాటలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రంలో ఆదివారం విద్యా సదస్సు నిర్వహించారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పాలకులు ప్రభుత్వ విద్యా విధానానికి పెద్దపీట వేయాలన్నారు. పోరాటాల ద్వారా మాత్రమే ఉపాధ్యాయుల హక్కుల సాధన సాధ్యమని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు చైతన్యవంతులై కొత్త తరాలను తయారు చేయాలని కోరారు. ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ.. జిఒ నెంబర్ 117 రద్దు, పాఠశాలల కుదింపు వంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే పోరాటాలు అనివార్యమని తెలిపారు. యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు రూ.20 వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిపోయిందన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలపై సరైన శ్రద్ధ చూపడంలేదని తెలిపారు. దీంతో బకాయిలు రూ.30 వేల కోట్లకు పెరిగిపోయాయన్నారు. 29 శాతం ఐఆర్ ప్రకటించి, 12వ పిఆర్‌సి కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరుబాట ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఊరి బడిని బతికించుకోవటానికి ఉపాధ్యాయులంతా నడుం కట్టాలన్నారు. అందుకోసం పిల్లలు, తల్లిదండ్రులతో అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు ఉనికిని కోల్పోతున్నాయన్నారు. భవిష్యత్తులో మోడల్ పాఠశాలల పేరుతో గ్రామాల్లో చాలా పాఠశాలలను ఎత్తేయ్యాలనే యోచనతో ప్రభుత్వం ఉందని వివరించారు. తొలుత భగత్‌సింగ్, యుటిఎఫ్ ఉద్యమ నిర్మాతలు అప్పారి వెంకటస్వామి, ఎఇ సూర్యనారాయణ రాజు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్.జ్యోతిబసు, తోటకూర చక్రవర్తి, కె.శ్రీదేవి, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.