- పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. 2023 జులై నాటికి నియమించాల్సిన 12వ వేతన సంఘాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని, ఈ ప్రభుత్వం వెంటనే వేతన సంఘాన్ని నియమించాలని కోరారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షనర్ల డిఎ, పిఆర్‌సి ఎరియర్స్ బకాయిలు రూ.22 వేలకోట్లలో కొంత భాగం అయినా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. జిఓ నెంబర్ 114 ప్రకారం… 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడానికి అర్హులుగా గుర్తించారని అన్నారు. ఇప్పటికి మూడు వేల మందిని మాత్రమే పర్మినెంట్ చేశారని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే ప్రక్రియ కొనసాగించాలన్నారు. 2003లో ఉపాధ్యాయులు, ఉద్యోగులుగా ఎంపికైన వారికి పాత పింఛను విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌టిఆర్ జిల్లా జగ్గయ్యపేట, పల్నాడు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్లలో అతిసార వ్యాధి ప్రబలి 10 మందికిపైగా చనిపోయారని, మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని కోరారు. పంటల బీమా పథకంలో లోపాలు సవరించి రైతు సంఘాలతో చర్చించి పంటలకు సమగ్రంగా బీమా పథకం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు.