గంగవరం పోర్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  •  సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ : గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌కు గంగవరం పోర్టు నుంచి సరఫరా కావాల్సిన కోకింగ్‌ కోల్‌ సరఫరా కానందున విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కోక్‌ ఓవెన్‌ డిపార్టుమెంట్‌లో తీవ్ర సమస్యలు ఏర్పడ్డాయని హైకోర్టులో సి అసోసియేషన్‌ పిటిషన్‌ వేసిందని, గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యనియన్‌ (సిఐటియు) కూడా హైకోర్టు కేసులో చేరిందని తెలిపారు. పోర్టులో కార్మికులు సమ్మె చేస్తున్నందువల్ల కోకింగ్‌ కోల్‌ సరఫరా చేయలేకపోతున్నామని గంగవరం పోర్టు యాజమాన్యం హైకోర్టులో వాదనలు వినిపించగా ఈ వాదనలను కోర్టు తిరస్కరించిందని తెలిపారు. శుక్రవారం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం గంగవరం పోర్టు యాజమాన్యం యూనియన్‌తో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. గంగవరం పోర్టు కార్మికులు వెంటనే విధులకు హాజరు కావాలని హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. యాజమాన్యం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జూన్‌ 24న హైకోర్టు తిరిగి విచారించి తగిన నిర్ణయాలు చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారన్నారు. దీని ప్రకారం కార్మికులు ఈ నెల 4 నుంచి గంగవరం పోర్టులో విధులకు హాజరవుతారని తెలిపారు. జిల్లా అధికారులు కార్మిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నించినా పోర్టు యాజమాన్యం చర్చల్లో నోరుమెదపలేదని పేర్కొన్నారు. ఈలోగా యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని వెల్లడించారు. ముగ్గురు నాయకులను మూడు రాష్ట్రాల సిమెంట్‌ కంపెనీలకు ట్రాన్సఫర్‌ చేసిందని, ఐదుగురిని అక్రమంగా సస్సెండ్‌ చేసిందని తెలిపారు. పోర్టులో కార్మికులందరికీ యాజమాన్యం ఐదు రోజులపాటు జీతంలో కోత విధించిందని పేర్కొన్నారు. ఈ కక్షసాధింపు చర్యలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. పోర్టు ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న స్కిల్డ్‌ కార్మికులకు నెలకు రూ.15 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని, కార్మికులందరికీ బేసిక్‌ రూ.3700 మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఇఎస్‌ఐ లేని కార్మికులకు ఏ మెడికల్‌ సౌకర్యమూ లేదని తెలిపారు. డ్యూటీ తరువాత మూడు గంటలు అదనంగా పనిచేసినా ఏమీ ఇవ్వకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.

➡️