ప్రభుత్వాన్ని కోరిన పిడిఎఫ్ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జ్యోతిరావు ఫూలే బిసి గురుకుల పాఠశాలల్లోని గెస్ట్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని పిడిఎఫ్ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు కోరారు. శాసనమండలి ‘ప్రత్యేక ప్రస్తావన’లో భాగంగా శుక్రవారం ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. గెస్ట్ టీచర్లుగా 1,253 మంది పనిచేస్తున్నారని, వీరిని కంట్రాక్టు విధానంలోకి మార్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని, పనిభారం తగ్గించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల పోస్టులను క్రమబద్ధీకరించాలని, పిహెచ్‌సిల్లో కాంట్రాక్టు నర్సుల పోస్టులు పెంచాలని, వీరికి గ్రాస్ శాలరీ ఇవ్వాలని, బీమా ప్రీమియం చెల్లించాలని, బదిలీలకు అవకాశం ఇవ్వాలని కోరారు.
డిఎస్‌సి, ఎపిపిఎస్‌సి ఉద్యోగాలకు వయోపరిమితి 42 నుంచి 47 ఏళ్లకు పెంచాలని పిడిఎఫ్ సభ్యులు ఐ వెంకటేశ్వరరావు కోరారు. గ్రూప్-1 ప్రిలిమినరీ అభ్యర్థుల నిష్పత్తిని 1:50 నుంచి 1:100కు పెంచాలని కోరారు. డివైఇఒ పోస్టులకు ప్రిలిమినరీ నుంచి మెయిన్స్‌కు కటాఫ్ మార్కులు తగ్గిం చాలన్నారు. 2003లో నియమితులైన ఉపా ధ్యాయులకు, పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని పాకలపాటి రఘువర్మ కోరారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఆర్థికశాఖకు ప్రభుత్వం ఆదేశాలివ్వాలన్నారు.
కాకినాడ సెజ్‌లో పరిశ్రమల కోసం 10,500 ఎకరాలు కేటాయించారని, రెండు దశాబ్దాలుగా ఈ భూములు నిరుపయోగంగా ఉన్నాయని పి హరిప్రసాద్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములు తీసుకున్న సంస్థలు ఆ భూములు సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల పర్యవేక్షణకు ప్రజాప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు చేయాలని ఇందుకూరి రఘురాజు కోరారు. తిరుపతి రూరల్ మండలం, పేరూరు గ్రామంలో హోటల్ ముంతాజ్‌కు కేటాయించిన 20 ఎకరాల భూమిని రద్దు చేయాలని బల్లి కళ్యాణ చక్రవర్తి కోరారు. టిడిఆర్ బాండ్లలో జరిగిన అవకతవకలపై విచారణ నిర్వహించాలని భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి కోరారు. ఒక్క తిరుపతిలోనే విచారణకు ఆదేశాలిచ్చారని, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కడప తదితర నగరాల్లోనూ టిడిఆర్ బాండ్ల జారీలో పెద్దయెత్తున కుంభకోణం జరిగిందన్నారు.
