లారీ యజమానుల సమస్యలు పరిష్కరించాలి

  • లారీ యజమానుల సంఘం డిమాండ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో లారీ యజమానుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ లారీ యజమానుల సంఘం డిమాండ్‌ చేసింది. విజయవాడలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు, అధ్యక్షులు దాసరి శ్రీనివాసరెడ్డి, కృష్ణా జిల్లా అధ్యక్షులు నాగుమోతు రాజా, ట్రెజరర్‌ నాదెళ్ల కృష్ణ తదితరులు మాట్లాడారు. రాష్ట్రంలో రవాణా రంగం కుదేలైందని తెలిపారు. గడిచిన ప్రభుత్వం గ్రీన్‌ ట్యాక్స్‌ రూ.200 నుంచి రూ.25 వేలకు పెంచిందన్నారు. అపరాధ రుసుములు కూడా రూ.20 వేల వరకూ పెంచారని పేర్కొన్నారు. ఇవి చాలదన్నట్లు క్వార్టర్లీ ట్యాక్స్‌ 30 శాతం, పెట్రోల్‌, డీజిల్‌ పన్నులూ పెంచారని వివరించారు. రవాణా రంగంలో అతి తక్కువ సమయంలో పెద్దయెత్తున భారం పడిందని పేర్కొన్నారు. ఈ సమస్యలపై తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ అధ్యక్షులు చంద్రబాబు, యువ నాయకులు లోకేష్‌కు విన్నవించామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వందరోజుల్లో గ్రీన్‌ ట్యాక్స్‌ తగ్గిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ట్యాక్స్‌ల విషయంలోనూ ఇతర రాష్ట్రాలను పరిశీలించి తగ్గిస్తామని చెప్పారని వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత వరదల అనంతరం సంఘం తరపున ముఖ్యమంత్రికి, రవాణాశాఖ మంత్రికి వివరించామని పేర్కొన్నారు. దీనిపై అసెంబ్లీలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు కూడా జరుగుతున్న నష్టాన్ని గణాంకాలతో వివరించారని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత లారీ యజమానులకు న్యాయం జరుగుతుందని భావించామని, ఆచరణలో అమలు జరగడం లేదని తెలిపారు. రిజిస్ట్రేషన్ల భారం ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల్లో చేయించుకుంటున్నారని, దీనివల్ల ఆదాయం పక్క రాష్ట్రాలకు పోతోందని పేర్కొన్నారు. డీజిల్‌ ధరలు తగ్గించినందువల్ల కొనుగోళ్లు పెరిగి ఆదాయం వస్తుందని, దీన్ని కొద్దికాలం పరిశీలించి నష్టం వస్తే మరలా ధరలు పెంచుకోవాలని సూచించామని, దీన్ని కూడా అమలు చేయడం లేదని తెలిపారు. ప్రగతి నుండి ఇ-వాహన్‌కు డేటా పంపించడం వల్ల వాహన యజమానులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. నాలుగు నెలల నుంచి తీవ్ర సమస్యలున్నాయని, ఎన్‌ఐసి అధికారులు కూడా ఏమీ చేయలేకపోవడంతో వాహనదారులు రెగ్యులరైజ్‌ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల లారీ యజమానులు ఫిట్నెస్‌ పరీక్షలు చేయించుకోలేక అవస్థలు పడుతున్నారని వివరించారు. దీనిపై వెంటనే స్పందించి ప్రభుత్వం లారీ యజమానులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.

➡️