- సిఐటియు ఆధ్వర్యంలో ఆ షాపుల వద్ద ఆందోళనలు
ప్రజాశక్తి – యంత్రాంగం : తమిళనాడు రాష్ట్రం శ్రీపెరుంబుదూర్‌లోని సామ్‌సంగ్ తయారీ యూనిట్‌లో పనిచేస్తున్న కార్మికుల ఆందోళనకు మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఆ కంపెనీ షాపుల ముందు సంఘీభావ నిరసన తెలిపారు. విశాఖ డైమండ్ పార్కు వద్ద ఉన్న సామ్‌సంగ్ షాపు ముందు చేపట్టిన నిరసన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు మాట్లాడారు. 1470 మంది కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శ్రీపెరుంబుదూర్‌లోని ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌లో సుమారు 1800 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా 1470మంది యూనియన్ ఏర్పాటు చేసుకుని తమ న్యాయమైన డిమాండ్స్‌తో కూడిన మెమోరాండం యాజమాన్యానికి ఇస్తే యూనియన్ పెట్టుకొనే హక్కు లేదని, యూనియన్ పెడితే తొలగిస్తామని బెదిరించడం దుర్మార్గమన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం కార్మికులకు యూనియన్ పెట్టుకొనే హక్కు ఉందని తెలిపారు. సామ్‌సంగ్, ఎల్‌జి పాలిమర్స్, పోస్కోవంటి కంపెనీలు భారతదేశంలో కార్మిక చట్టాలు అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని విమర్శించారు.
కాకినాడ మెయిన్‌రోడ్డులోని సామ్‌సంగ్ షోరూమ్ వద్ద ధర్నా నిర్వహించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని, కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని ప్లకార్డులను ప్రదర్శించి నినదించారు. తిరుపతి, పుత్తూరు, నాయుడుపేటలో నిరసన తెలిపారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించి, కార్మిక చట్టాలను అమలు చేయాలని నినదించారు.