తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ యూనియన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకంలో పనిచేస్తున్న కెప్టెన్‌లకు వేతనాలు పెంచాలని తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండ్యన్‌కు యూనియన్ గౌరవాధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, అధ్యక్షులు ఎం బసవరాజు, ప్రధాన కార్యదర్శి ఎన్ దేవి ప్రసాద్ మంగళవారం వినతిపత్రాన్ని సమర్పించారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకంలో 500 వాహనాలకు 500 మంది కెప్టెన్లుగా పనిచేస్తున్నారని, వీరంతా అరబిందో (ఎఇఎంస్) సంస్థ రాష్ట్ర ప్రభుత్వ వైద్యారోగ్యశాఖకు సేవలందిస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. కెప్టెన్లకు నెలకు రూ.18,500 వేతనం చెల్లించాలని, పిఎఫ్ వాటా, ఇఎస్‌ఐ యాజమాన్యమే చెల్లించాలన్నారు. వారాంతపు, పండగ, జాతీయ సెలవు దినాలు అమలు చేయాలని కోరారు. విధి నిర్వహణకు అవసరమైన సెల్‌ఫోన్లు ఇవ్వాలని, ప్రతి నెలా మొబైల్ రీఛార్జి మొత్తం చెల్లించాలన్నారు. హైరిస్క్ ప్రెగెంట్ ఉమెన్, సివియర్ ఎనీమిక్ ప్రెగెంట్ ఉమెన్ సేవలకు అదనపు వేతనం చెల్లించాలని కోరారు. ప్రమాదాల్లో మరణించిన కెప్టెన్లకు ఆరోగ్య బీమా, ఎక్స్‌గ్రేషియా, బీమా సౌకర్యాలు కల్పించాలని, గతంలో ఉన్న విధంగా కనీసం రూ.7 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, దహన సంస్కారాలకు ఖర్చులు అందించాలని కోరారు. అలాగే 8 గంటల పని విధానం, వాహనాల మరమ్మతులు వెంటనే చేపట్టడం, మరమ్మతులకు అయ్యే ఖర్చు యాజమాన్యం ముందుగానే చెల్లించాలని కోరారు. కెప్టెన్లను ఆప్‌కాస్‌లో చేర్చాలన్నారు. అవసరమైన ఇంప్రెస్ క్యాష్ కెప్టెన్‌ల వద్ద ఉంచాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాల రిపేర్లు యాజమాన్యమే భరించాలని కోరారు. వాహనాల సంఖ్యను బట్టీ అదనపు, బఫర్ సిబ్బందిని నియమించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. 15 జిల్లాల్లో 45 వాహనాలు మరమ్మతులకు లోనయ్యాయని, వీటికి అవసరమైన రిపేర్లు వెంటనే చేయించి ప్రజలకు సేవలందించే చర్యలు చేపట్టాలని కోరారు. అరబిందో సంస్థ యాజమాన్యం మారుతున్న నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
