సిఎంకు కెవిపిఎస్ లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కాటికాపరుల సమస్యలు పరిష్కరించాలని కెవిపిఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒ.నల్లప్ప, అండ్ర మాల్యాద్రి ఆదివారం సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు. స్మశానాల్లో గుంటలు తీసి పూడ్చే వృత్తి చేస్తున్న వారందరికీ గుర్తింపు కార్డులిచ్చి 4వ తరగతి ఉద్యోగులుగా నియమించాలని, వయసునిండిన వారందరికీ రూ.5వేలు పింఛన్ ఇవ్వాలని కోరారు. వృత్తి పరికరాలైన గడ్డపార, రెండు చెలికలు, రెండు గంపలు, గ్లౌజ్, బూట్లు, డ్రస్ ఇవ్వాలని, భయంకరమైన వ్యాధులు ప్రభలే శ్మశానంలో పనిచేసే వృత్తిదారులందరికీ ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు. వృత్తిదారులందరికీ రెండెకరాల సాగు భూమి, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణల్లో 2 సెంట్లుస్థలం కేటాయించడంతోపాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సిఎంకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. స్మశానాలు కబ్జాకు గురికాకుండా ఆక్రమణదారుల నుంచి కాపాడాలని, జీఓ నెంబరు 1235 ప్రకారం ప్రతి దళిత పేటకు రెండు ఎకరాలు స్మశాన స్థలం కేటాయించాలని కెవిపిఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒ.నల్లప్ప, అండ్ర మాల్యాద్రి కోరారు.
