గిరిజన గురుకులాల టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

Dec 13,2024 00:30 #problems, #solved, #Teachers, #Tribal
  • సమ్మె మరింత ఉధృతం
  • యూనియన్‌ రాష్ట్ర కమిటీ నిర్ణయం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో  : గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎపి గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్‌ సోర్సింగ్‌ టీచర్స్‌ అండ్‌ లెక్చరర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటి డిమాండ్‌ చేసింది. కమిటీ పిలుపు మేరకు గురువారం నిర్వహించిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమంలో ఔట్‌ సోర్సింగ్‌ టీచర్లు, లెక్చరర్స్‌ వేలాదిగా పాల్గొని, ధర్నా చౌక్‌లో నిరసన తెలియజేశారు. గత నెల 16వ తేదీ నుంచి నిర్వహిస్తున్న సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.లక్ష్మీనాయక్‌, జె.మల్లిఖార్జున నాయక్‌లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ నెల 14, 15వ తేదీల్లో విద్యార్ధుల తల్లిదండ్రులను కలిసి మద్ధతు కోరడం, 16న ఐటిడిఎ, డిటిడబ్ల్యూ కార్యాలయాల వద్ద ధర్నాలు, 17న బిక్షాటన, 18న పిల్లలకు ధర్నా శిబిరాలలో పాఠాల బోధన, 19న ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ధర్నాలు, సామాజిక వినతి పత్రాలు ఇవ్వడం, 20న విద్యార్ధుల తల్లిదండ్రులతో పాఠశాలల ముందు నిరసనలు, 21న వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ టీచర్స్‌ జెఎసి ఛైర్మన్‌ ఎ.వి నాగేశ్వరరావు గిరిజన సంక్షేమ గురుకులాల టీచర్స్‌ సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గిరిజన గురుకులాల టీచర్లను గత ప్రభుత్వం అన్యాయంగా ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలోకి మార్చిందన్నారు. దాదాపు 10 ఏళ్లుకుపైగా గిరిజన విద్యార్ధులకు నిబద్ధత, అంకిత భావంతో అతి తక్కువ వేతనాలకే సేవలందిస్తున్న వీరి వేతనాలను వెంటనే పెంచాలని, కెజిబివి, మోడల్‌ స్కూల్స్‌ తరహాలో కాంట్రాక్ట్‌ విధానంలోకి మార్చాలని, మెగా డిఎస్సి నుంచి మినహాయింపు ఇచ్చి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ, గురుకుల టీచర్లు చేయబోయే పోరాటాలన్నింటికీ మద్దతు ఇస్తానని తెలియజేశారు. గిరిజన సమాఖ్య అధ్యక్షులు కె.రాజానాయక్‌ సంఘీభావం తెలుపుతూ గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులపై వివక్ష తగదని, వీరందర్నీ కాంట్రాక్టు విధానంలోకి మార్చాలని డిమాండ్‌ చేశారు.
సిఎంకు లేఖ రాసిన సిపిఐ
గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులను కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్స్‌ (సిఆర్‌టి)గా మార్చి 2022 పిఆర్‌సి ప్రకారం జీతాలు చెల్లించాలని సిపిఐ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం లేఖ రాశారు. గత 15 ఏళ్లుగా వీరు గిరిజన సంక్షేమ గురుకులాల్లో అతి తక్కువ జీతానికి పని చేస్తోన్నారని, రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వీరి డిమాండ్లపై చర్చించి వెంటనే పరిష్కరించాలని సిఎంను కోరారు.

➡️