- ‘రైతు మారాజు’ పుస్తకావిష్కరణ సభలో వక్తలు
ప్రజాశక్తి- అనంతపురం : రైతు లేకపోతే ఏ దేశమైనా ప్రగతిని సాధించలేదని పలువురు వక్తలు అన్నారు. మార్తాటి ఈశ్వరీగోపాలరావు రచించిన ‘రైతు మారాజు’ పుస్తకావిష్కరణ సభ అనంతపురంలోని ఎన్‌జిఒ హోంలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు జి. బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ కవి, విమర్శకులు, పుస్తక సమీక్షకులు తూముచర్ల రాజారామ్ మాట్లాడుతూ రైతు మారాజు కావ్యం రైతు జీవితం, మట్టి వాసన, పల్లెటూరు సోయగాలు, రైతుతో ముడిపెట్టిన జీవితం కనిపిస్తుందన్నారు. ఆచార్య బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ రైతు నూతన సాంకేతిక వ్యవసాయంలో నవీన పద్ధతులను చేపట్టాలని రచయిత ఈ కావ్యంలో పేర్కొన్నారని వివరించారు. జనప్రియ కవి ఏలూరు యంగన్న మాట్లాడుతూ రైతు మారాజు కావ్యంలో రచయిత పశుసంపదను దేశ సంపదగా కీర్తిస్తాడని, ఎరువుల కల్తీని ఎండగట్టాడని పేర్కొన్నారు. మరో కవి సి.రాము మాట్లాడుతూ గోపాలరావు కవి మాత్రమే కాదని, మంచి సామాజిక నాటకాలు రాసి ప్రజల్లో చైతన్యవంతం కలిగించాడని కొనియాడారు. పుస్తక రచయిత మార్తాటి ఈశ్వరీ గోపాలరావు మాట్లాడుతూ కరువుకు కారణం వర్షాలు రాకపోవడం ఒక్కటే కారణం కాదని, కర్షక వృత్తి భంగం కావడం కూడా కారణమని పేర్కొన్నారు. ఏ దేశమైతే రైతును గౌరవిస్తుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అనంత కవులు వేదిక ప్రధాన కార్యదర్శి వి.చంద్రశేఖరశాస్త్రి, తెలుగు వెలుగు వ్యవస్థాపక అధ్యక్షులు టివి రెడ్డి తదితరులు ప్రసంగించారు. అక్షర యోధుడు రామోజీరావు మరణం పట్ల పుస్తకావిష్కరణ కార్యక్రమ ప్రారంభంలో సంతాపం ప్రకటించి మౌనం పాటించారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అనంతపురం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.