- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు
ప్రజాశక్తి – విజయవాడ : విద్యుత్ నియంత్రణ మండలి పేరుతో రూ.7200 కోట్ల సర్దుబాటు ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు విమర్శించారు. 2022-23లో వినియోగించిన విద్యుత్‌పై అదనంగా సర్దుబాటు ఛార్జీల వసూలుపై ప్రతిపాదనకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) బహిరంగ ప్రకటన విడుదల చేసిందని తెలిపారు. విజయవాడలోని సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో ఎపిఇఆర్‌సి ప్రతిపాదనల కాపీలను సిపిఎం నేతలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ.. సిపిడిసిఎల్ వారు యూనిట్‌కు ఒక్కో త్రైమాసికానికి రూ.3.27, రూ.1.50, రూ.1.47, రూ.0.45 చొప్పున, సిపిడిసిఎల్ వారు రూ.1.92, రూ.1.43, రూ.0.82, రూ.0.03 చొప్పున, ఇపిడిసిఎల్ వారు రూ.2.07, రూ.1.39, రూ.1.16, రూ.0.38 చొప్పున వసూలు చేయడానికి పెట్టిన ప్రతిపాదనలపై ఇఆర్‌సి బహిరంగ ప్రకటన ఇచ్చిందని తెలిపారు. అక్టోబర్ 14లోపు అభ్యంతరాలు తీసుకుని, 18న బహిరంగ విచారణ చేస్తామని మండలి ప్రకటించిందని వివరించారు. ఇది మొక్కుబడి తంతు మాత్రమేనని విమర్శించారు. 2014-19లో టిడిపి ప్రభుత్వ హయాంలోనూ, గత వైసిపి ప్రభుత్వ హయాంలోనూ వినియోగించుకున్న విద్యుత్‌పై సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపారని గుర్తుచేశారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకొస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, ఉన్న ఛార్జీలను తగ్గిస్తామని ప్రజలకు మాట ఇచ్చారని, ఇచ్చిన మాటపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సర్దుబాటు ఛార్జీల ప్రతిపాదనను పూర్తిగా రద్దు చేయాని డిమాండ్ చేశారు. సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ, జిల్లా కార్యదర్శివర్గసభ్యులు డి.కాశీనాథ్, కె.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.