- బుడమేరు వరద ముంపు అరుదైనదిగా అంచనా
- భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ట్రాక్‌లు
- వరద నియంత్రణతోనే ముంపు నుండి భరోసా
ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : దేశంలోనే అత్యంత ఆదాయాన్ని సమకూర్చే విజయవాడ రైల్వే డివిజన్‌కు బుడమేరు వరద దెబ్బ బలంగానే తాకింది. విజయవాడ-హైదరాబాద్ రూట్లో కీలకంగా ఉన్న రాయనపాడు శాటిలైట్ స్టేషన్, కొండపల్లి స్టేషన్ల వద్ద రైల్వే ట్రాక్‌లు ముంపునకు గురవ్వడంతో రోజుల తరబడి రైల్వే ప్రయాణికులకు, గూడ్స్ రవాణాకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే రైల్వేశాఖ దీనిపై నివేదికలు సిద్ధం చేసింది. బుడమేరు వరద నియంత్రణతోనే ఈ రూట్లో భవిష్యత్తులో సమస్య తలెత్తకుండా ఉంటుందని రైల్వే అధికారులు నిర్ధారించినట్లు తెలిసింది. భౌగోళిక పరిస్థితులు (జియో గ్రాఫికల్ కండిషన్) ఆధారంగానే రైల్వే లైన్లు ఏర్పాటై ఉంటాయి. ట్రాకులపై ఆగే రైళ్లలోకి ప్రయాణికులు ఎక్కేందుకు వీలుగా స్టేషన్లలో ఫ్లాట్‌ఫారాలు నిర్మిస్తారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలోని ట్రాక్‌లు, స్టేషన్లలో మార్పులు, చేర్పులు చేయడానికి వీలుపడదు. విజయవాడ రైల్వే స్టేషన్ మీదుగా రోజువారీ 450 రైళ్లు నడుస్తాయి. వీటిలో 300 ప్రయాణికుల రైళ్లు కాగా, మిగిలిన 150 గూడ్స్ రైళ్లు. ఏడాదికి రూ.5,580 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జిస్తూ దేశంలోనే అతిపెద్ద డివిజన్లలో ఒకటిగా నిలిచింది. బుడమేరు వరదతో దీని పరిధిలోని రెండు స్టేషన్లు ముంపునకు గురయ్యాయి. వారం రోజులపాటు వందలాది రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. కొండపల్లి, రాయనపాడు రైల్వేస్టేషన్లలో నిలిచిన రైళ్లలోని ప్రయాణికులను అక్కడే దించి వేసి బస్సుల్లో వారి గమ్యస్థానాలకు తరలించాల్సి వచ్చింది. గూడ్స్ రవాణా నిలిచిపోవడం కూడా వ్యాపార సంస్ధలకు సమస్యగా మారింది. రైల్వే ఆదాయానికీ గండి పడింది. బుడమేరు వరదను అత్యంత అరుదుగా జరిగే ఘటనగా రైల్వేశాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో సాంకేతిక చర్యలకు వీలులేకపోతే సంబంధిత స్టేషన్లలో ట్రాక్‌లు, స్టేషన్ల ఎత్తుపెంచడానికి అవకాశం లేదని రైల్వే శాఖ నిర్ధారించినట్లు తెలిసింది.
ట్రాక్‌ల ముంపు నివారణకు రక్షణ గోడ!
భవిష్యత్తులో విజయవాడ నగరం బుడమేరు వరద ముంపునకు గురికాకుండా చూడటానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిలో భాగంగా బుడమేరు కట్టల పటిష్టత, విస్తరణ, పూడికతీత, వరద మళ్లింపు కాల్వల ఏర్పాటు తదితరాలను పరిశీలిస్తోంది. రైల్వే ట్రాక్‌లు, స్టేషన్లు సైతం ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కొండపల్లి, రాయనపాడు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు, స్టేషన్లు బుడమేరుకు సమీపంగానే ఉన్నాయి. ఈ క్రమంలో వరద నియంత్రణ చర్యల్లో భాగంగా రైల్వేస్టేషన్లు, ట్రాక్‌ల ముంపు నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. రిటైనింగ్ వాల్ నిర్మించడం ద్వారా బుడమేరు వరదను నియంత్రించి ట్రాక్‌లు, స్టేషన్లు ముంపునకు గురవ్వకుండా రక్షించాల్సి ఉంది.