ఫలించిన పోరాటం- వేతన బకాయిలపై కమిషనర్‌ హామీ

-సమ్మె విరమించిన మున్సిపల్‌ కార్మికులు
ప్రజాశక్తి- సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా):పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్‌ కార్మికుల పోరాటం పలించింది. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులతో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వాణి మంగళవారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో, కార్మికులు సమ్మె విరమించారు. వేతన బకాయిలు ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని కమిషనర్‌ ప్రసన్నవాణి హామీ ఇచ్చినట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత కొద్ది నెలలుగా మున్సిపల్‌ కార్మికులు ఆందోళన చేపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో వారు సోమవారం నుంచి సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో కమిషనర్‌ చర్చలు జరిపారు. ఈ ఏడాది జనవరిలో ఉన్న రూ.3 వేల బకాయి వేతనాలు, సంక్రాంతికి ఇవ్వాల్సిన పండగ ఖర్చులు వెయ్యి రూపాయలు, ఫిబ్రవరి వేతన బకాయి రూ.6 వేలు చెల్లించేందుకు ఆమె అంగీకరించారు. శానిటేషన్‌ విభాగంలో పనిచేస్తోన్న డ్రైవర్లకు పెంచిన వేతనం రూ.24,500 వెంటనే అమలుకు ఒప్పుకున్నారు. ఈ చర్చల్లో ఫెడరేషన్‌ నాయకులు టి.శంకరరావు, టి.రాముడు, పోల్రారాజు, టి.ఇందు పాల్గొన్నారు.

➡️