ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ప్రైవేటు కళాశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. దీంతో మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు ఫలితాలు భేష్‌గా ఉన్నాయని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గత పదేళ్లలో లేని విధంగా ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగిందని, జూనియర్ కళాశాలల్లో ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఇందుకు కారణమన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 47 శాతం, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 69 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో పార్వతీపురం మన్యం జిల్లా 70 శాతం ఫలితాలు సాధించి ప్రధమ స్థానంలో నిలవగా, విశాఖ జిల్లా 34 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచిందన్నారు. రెండో సంవత్సరం పరీక్షల్లోనూ పార్వతీపురం మన్యం జిల్లా 81 శాతం ఫలితాలు సాధించి ప్రథమ స్థానంలోనూ, విశాఖపట్నం జిల్లా 55 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఇంటర్ ఒకేషనల్ ఫలితాల్లోనూ గత పదేళ్లతో పోలిస్తే రికార్డు స్థాయిలో విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ప్రభు త్వ జూనియర్ కళాశాలల్లో ఒకేషనల్ కోర్సుల్లో మొదటి ఏడాదిలో 64 శాతం ఉత్తీర్ణత సాధించగా, రెండవ సంవత్సరంలో 82 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలతోపాటు నోట్ పుస్తకాలను అందించామన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేశామని తెలిపారు. కళాశాలల పని వేళలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పెంచా మన్నారు. దీనికితోడు అంతర్గత పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ఫలితాలు ఆధారంగా అధ్యాపకుల పని తీరు విశ్లేషించి తగిన చర్యలు తీసుకున్నారన్నారు. పేరెంట్ టీచర్ సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు పోగ్రెస్ కార్డులు ఇచ్చినట్లు చెప్పారు. టేక్ కేర్ వ్యవస్థను ఏర్పాటుచేసి విద్యార్థుల అభ్యసన ఫలితాలు, అటెండెన్స్ బాధ్యతలను అప్పగించామన్నారు. ఫలితంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగినట్లు తెలిపారు.
