- కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
- ఫార్మా ప్రమాద బాధితులకు పరామర్శ
ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం) : కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పరవాడ ఫార్మాసిటీలోని ఠాగూర్ లేబొరేటరీలో విషవాయువు లీకవ్వడంతో అస్వస్థతకు గురై విశాఖలోని షీలా నగర్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుతో కలిసి ఆయన శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 26న ఠాగూర్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ జిఎల్‌ఆర్ – 325 నుంచి క్లోరో ఫామ్ లీకై నేలపై పడిందని తెలిపారు. ఆ సమయంలో నేలపై పడిన బూడిదను శుభ్రపరిచే సమయంలో కార్మికులు ప్రమాదానికి గురయ్యారన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు చనిపోయారని, వారి కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించామని తెలిపారు. 26 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారంతా క్షేమంగానే ఉన్నారన్నారు. ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు వెంటాడుతున్నాయని విమర్శించారు.