ఆర్థిక ప్రయోజనాలు కాపాడడంలో రెవెన్యూ సర్వీస్‌ అధికారుల పాత్ర కీలకం

  • కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి
  • అట్టహాసంగా 74వ బ్యాచ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

ప్రజాశక్తి-పెనుకొండ (అనంతపురం) : దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడడంలో భారతీయ రెవెన్యూ సర్వీస్‌ (కస్టమ్స్‌,పరోక్ష పన్నులు) అధికారుల పాత్ర కీలకమైనదని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌చౌదరి అన్నారు. అనంతపురం జిల్లా గోరంట్ల సమీపంలోని పాలసముద్రం వద్ద ఉన్న నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్‌, ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌ (నాసెన్‌)లో శిక్షణ పొందిన భారతీయ రెవెన్యూ సర్వీస్‌ (కస్టమ్స్‌, పరోక్ష పన్నులు) అధికారుల 74వ బ్యాచ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ను శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ బ్యాచ్‌లో 25 మంది పురుషులు, పది మంది మహిళలతో కలిసి మొత్తం 35 మంది అధికారులు ఉన్నారు. శుక్రవారం నిర్వహించిన ఈ పరేడ్‌కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సిబిఐసి) చైర్మన్‌ సంజరు కుమార్‌ అగర్వాల్‌ , సిబిఐసి బోర్డు మెంబర్లు శశాంక్‌ ప్రియ, యోగేంద్ర గార్గే, నా సిన్‌ ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌ గైగొంగ్డిన్‌ పన్మయి, సిబిఐసి సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంకజ్‌ చౌదరి మాట్లాడుతూ.. వాణిజ్యాన్ని సులభతరం చేయడంలో, భారత ఆర్థిక వ్యవస్థను పరిరక్షించడంలో కీలక బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్న అధికారులను అభినందించారు. ఆర్థిక పురోగతి, సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ విజన్‌ వికసిత్‌ భారత్‌ను ముందుకు తీసుకెళ్లగలరన్న విశ్వాసం వ్యక్తం చేశారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బంగారు పతకాలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ టిఎస్‌. చేతన్‌, ఎస్‌పి రత్న, డిఎస్‌పి వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లేపాక్షిలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయాన్ని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో కేంద్రమంత్రిని సత్కరించారు.

➡️