లారీని ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు – డ్రైవర్‌కు తీవ్రగాయాలు

ప్రజాశక్తి- దేవరపల్లి (తూర్పు గోదావరి) : ఆర్‌టిసి బస్సు లారీని ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్‌కు తీవ్రగాయాలవ్వగా, ఐదుగురికి స్వల్పగాయాలైన ఘటన బుధవారం దేవరపల్లిలో జరిగింది. దేవరపల్లి డైమండ్‌ జంక్షన్‌ వద్ద ఫ్లై ఓవర్‌ హైవే పైన విశాఖపట్నం నుండి విజయవాడ వైపుగా హైదరాబాద్‌కు వెళుతున్న ఎపి 31 జడ్‌ 0263 నెంబరు ఉన్న ఆర్టీసీ అమరావతి ఏసి బస్సు ముందువైపు వెళుతున్న ఎపి16టిహెచ్‌ 9216 నెంబరు ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ కి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో 25 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మిగతావారు సురక్షితంగా ఉన్నారు. తీవ్రగాయాలపాలైన డ్రైవర్‌ ని చికిత్స నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు ఎస్‌ఐ శ్రీహరిరావు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.

➡️