రెండోదశ పూలింగుపై అన్నీ అనుమానాలే

గ్రామసభల్లో ప్రశ్నిస్తున్న రైతులు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా తాడికొండ, అమరావతి, మంగళగిరి రూరల్‌ మండలాల్లోని గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో దశ భూసమీకరణ ప్రక్రియపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తొలిదశలో సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకే ఇప్పటి వరకూ ఏమీ ఇవ్వలేదని, కొత్తగా తీసుకుని ఏమి చేస్తారనే ప్రశ్నలు వారి నుండి ఎదురవుతున్నాయి. రెండోదశ పూలింగులో మొత్తం 44,676.64 ఎకరాలు సమీకరణ కింద తీసుకోనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పూలింగుకు గతంలో గ్రామసభల్లో ముందుగానే ప్రచారం చేశారు. అధికారులు వెళ్లి రైతులు చెప్పిందంతా రాసుకున్నారు. ఈసారి గ్రామసభలను మాత్రం పూర్తిగా రాజకీయ పరమైన కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూర్చుని వారి ముందే రైతులతో మాట్లాడించి ఆమోదం ఇచ్చినట్లు రాసుకుంటున్నారు. పెదకూరపాడు నియోజకవర్గం గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో రైతుల్లో కొంతమంది పూలింగుకు ముందుకు వచ్చినా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తాడికొండ, మంగళగిరి రూరల్‌ మండలాల పరిధిలో రైతులు అసలు పూలింగుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు ఇప్పటికే పూర్తిగా అభివృద్ధి చెంది ఉన్నాయని, ఇన్నర్‌రింగురోడ్డుపడితే గుంటూరు, అమరావతి, విజయవాడ కలిసిపోతాయని, అలాంటప్పుడు తమ భూములు ఎందుకు తీసుకుంటున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. పైగా తాడికొండ మండలంలో ఎక్కువగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఎకరాల నుండి గజాల లెక్కకు మారిపోయాయి. ఇప్పుడు వాటిని ఏ పద్ధతిలో తీసుకుంటారో చెప్పాలనీ రైతులు ప్రశ్నిస్తున్నారు. కంతేరు రైతుల భూములు పూర్తిగా జాతీయ రహదారికి అనుకుని ఉన్నాయి. వాటిని సమీకరణ చేయాల్సిన అవసరం ఏమిటో తెలియడం లేదని చెబుతున్నారు. తీసుకుంటే కంతేరు పరిధిలో ఉన్న అన్ని లేఅవుట్లనూ తీసుకోవాలని, కేవలం సాగులో ఉన్న భూములను తీసుకుంటే రైతుల నోట్లో మట్టికొట్టినట్లేనని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇచ్చే ప్లాట్లను బ్యాంకుల్లో తనఖా పెట్టుకుని వెంటనే రుణాలు ఇచ్చేలా చూడాలని కోరుతున్నారు. ప్రధాని సభ పూర్తయినప్పటి నుండి అన్ని గ్రామాల్లోనూ ఇదే అంశాలపై చర్చ జరుగుతోంది. పదేళ్ల క్రితం తుళ్లూరు మండల పరిధిలో తీసుకున్న భూములకే ఇప్పటికీ న్యాయం జరగలేదని, వారి భూముల్లో నిర్మాణాలకు అనుమతులు లేవని, మరి మా భూముల్లో ఎప్పటికి అనుమతులు ఇస్తారో చెప్పాలని వారు సభకు వచ్చిన అధికారులు, ప్రజాప్రనతినిధులను ప్రశ్నించారు. కొత్తగా తీసుకునే భూముల్లో ఏమేమి అభివృద్ధి పనులు చేపడతారో చెప్పాలనీ కోరారు. టెక్నాలజీకి సంబంధించి కంపెనీలన్నీ విశాఖలో పెడుతున్నప్పుడు ఇక్కడ ఏర్పాటు చేస్తే స్మార్ట్‌ కంపెనీలు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకూ రెండు విడతులగా ఐదు గ్రామాల్లో జరిగిన గ్రామసభల్లో రైతులు ఇవే అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలోనూ మూడేళ్లలో రైతులకు న్యాయం చేస్తామని చెప్పారని, పదేళ్లు అయినా ఇంతవరకు అతీగతి లేదని, అలాంటప్పుడు అదనంగా తీసుకునే భూములకు సంబంధించి ఏమి చేస్తారో ముందుగానే స్పష్టత ఇవ్వాలని రైతులు కోరారు. ఎకరాకు రూ.60 వేలు పరిహారం ఇవ్వడంతోపాటు అంతకుముందు అమల్లో ఉన్న ప్రతిఏటా పదిశాతం పెంపుదలను అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

➡️