విద్యా సంస్థల బంద్‌ సంపూర్ణం

Jul 4,2024 22:32 #NEET exam results, #sfi dharna
  • రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు
  • విజయవాడ, అనంతపురంలో అరెస్టులు

ప్రజాశక్తి-యంత్రాంగం : నీట్‌ స్కామ్‌పై సమగ్ర విచారణ జరపాలని, పేపర్‌ లీకేజీకి కేంద్ర బిందువైన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ)ను రద్దు చేయాలని, అందుకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యూ,. ఎఐఎస్‌ఎఫ్‌, పిడిఎస్‌యు, ఎఐఎస్‌ఎ, ఎన్‌ఎస్‌యుఐ, పిడిఎస్‌ఒ ఆధ్వర్యాన తలపెట్టిన విద్యా సంస్థల బంద్‌ జయప్రదమైంది. ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. విజయవాడ, అనంతపురంలో విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేశారు.
విజయవాడ మొగల్‌రాజపురంలోని సిద్దార్థ కళాశాల ఎదుట పెద్ద సంఖ్యలో విద్యార్థులు నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులను విచక్షణారహితంగా ఈడ్చుకెళ్లి వ్యానులో ఎక్కించారు. అక్రమంగా అరెస్టు చేసి మాచవరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థి సంఘాల నేతలపై 170 బిఎన్‌ఎస్‌ అనే కొత్త చట్టం కింద కేసులు నమోదు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వి.జాన్సన్‌ బాబు మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా నీట్‌, నెట్‌ పేపర్‌ లీకేజీలో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారన్నారు. ఐదేళ్లుగా 65 పేపర్‌ లీకేజీలు జరిగాయని, పరీక్షలు నిర్వహించే ఎన్‌టిఎ సంస్థపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎన్‌టిఎను రద్దు చేసి రాష్ట్రాల పరిధిలో నీట్‌, నెట్‌ పాత పద్ధతిలో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. పిడిఎస్‌యు నాయకులు ఎం.రామకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సి.హెచ్‌.వెంకటేశ్వరరావు, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి సాయి కుమార్‌, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు భూషన్‌, ఐసా జిల్లా కార్యదర్శి మహేష్‌, శివ నాయక్‌, ఎస్‌ఎఫ్‌ఐ సిటీ కార్యదర్శి కుమారస్వామి పాల్గొన్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ర్యాలీలో, నిరసనలు తెలిపారు.

అనంతపురం జిల్లా రాయదుర్గంలో ర్యాలీ చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాల్లోని అన్ని ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. విశాఖలోని కృష్ణా కాలేజీ నుంచి మద్దిలపాలెం జంక్షన్‌ వరకు, అలాగే జైల్‌ రోడ్డులోని ప్రభుత్వ మహిళా జూనియర్‌ కాలేజీ నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ప్రదర్శనలు చేశారు.కార్యక్రమాలను ఉద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రామ్మోహన్‌, పిడిఎస్‌ఒ రాష్ట్ర కోశాధికారి ఎల్‌.భాను మాట్లాడారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. అల్లూరి జిల్లా అరకులోయలో విద్యార్థులు ర్యాలీ చేపట్టగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మద్దతు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, పలాస, టెక్కలి, నరసన్నపేట, పొందూరులో ర్యాలీ నిర్వహించారు. నీట్‌ పరీక్షను రద్దు చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. విజయనగరం కోట జంక్షన్‌ వద్ద నిరసన తెలిపారు. బొబ్బిలి, ఎస్‌.కోట, గజపతినగరంలో బంద్‌ జరిగింది. పార్వతీపురంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వరకు నిరసన ప్రదర్శన చేశారు. కురుపాంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కర్నూలులో బైక్‌ ర్యాలీ చేపట్టి కలెక్టరేట్‌ ఎదుట, ఆదోనిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో గంటసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకకున్నారు. అనంతరం వారిని విడిచిపెట్టారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని పద్మావతి నగర్‌ సర్కిల్‌ నుండి శ్రీనివాస్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు రమేష్‌ నాయక్‌, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ఎండి రఫీ మాట్లాడారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిరసన తెలిపారు. మంగళగిరిలో ర్యాలీ నిర్వహించారు. పల్నాడు జిల్లా నరసరరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లిలో ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో విద్యార్థి సంఘాల నేతలు ఉదయం నుంచే పాఠశాలలను మూయించారు. తిరుపతి జిల్లా గూడూరు, సత్యవేడులో ర్యాలీలు, పుత్తూరులో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరసనలు తెలిపారు. తూర్పుగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. అనంతరం మానవహారం చేపట్టారు.

➡️