పల్నాడులో పరిస్థితి అదుపులోనే ఉంది

  •  హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

ప్రజాశక్తి-అమరావతి : పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన అల్లర్లు అదుపులోనే ఉన్నాయని హైకోర్టుకు రాష్ట్ర సర్కారు తెలిపింది. అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు నివేదించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు ఉన్నాయని, 144 సెక్షన్‌ అమల్లో ఉందని తెలిపింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు లా అండ్‌ ఆర్డర్‌ సమస్య తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడు జిల్లాలో హింసాత్మక సంఘటనలను అదుపులోకి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, అదనపు బలగాలను మోహరించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ అదే జిల్లాలోని కొత్తపేటకు చెందిన నలబోతు రామకోటేశ్వరరావు పిటిషన్‌ వేశారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ ఎన్‌ నిర్మల్‌ కుమార్‌ వివరాలు సమర్పించారు. పిటిషనరు తరపున న్యాయవాది పి రవితేజ వాదిస్తూ.. ఎన్నికల రాష్ట్ర ప్రధాన అధికారికి వినతిపత్రం సమర్పించిన తర్వాత కూడా అదనపు బలగాలను ఏర్పాటు చేయలేదన్నారు. జిల్లా ఎస్‌పి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని వినతిపత్రంలో పేర్కొన్నట్లు వివరించారు. వాదనల తర్వాత హైకోర్టు స్పందిస్తూ.. అల్లర్లు జరగకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌ పరిష్కారమైనట్లు ప్రకటించింది.

➡️