- సిపిఎం రాష్ట్ర మహాసభలో వివిధ జిల్లాల అనుభవాలు
- చర్చల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతినిధులు
ప్రజాశక్తి- కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ (నెల్లూరు) : పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని సిపిఎం రాష్ట్ర మహాసభకు హాజరైన ప్రతినిధులు చెప్పారు. సీతారాం ఏచూరి నగర్‌లో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర మహాసభలో రెండో రోజు ఆదివారం ప్రతినిధులు ఉత్సాహపూరితంగా చర్చల్లో పాల్గొన్నారు. కార్యదర్శి ప్రవేశపెట్టిన రాజకీయ నిర్మాణ నివేదికపై జిల్లాల వారీగా చర్చించారు. ఈ మూడేళ్ల కాలంలో తమతమ జిల్లాల్లో నిర్వహించిన పోరాటాల అనుభవాలను, మహాసభ ముందుంచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగానూ, స్థానిక సమస్యపైనా ఆయా జిల్లాల్లో నిర్వహించిన పోరాటాలను వివరించారు. తొలుత బాపట్ల జిల్లా ప్రతినిధి గంగయ్య మాట్లాడుతూ.. బాపట్ల జిల్లా కొత్తగా ఏర్పడినా ఉద్యమ సంప్రదాయం ఉందని, ఇంటింటికీ సిపిఎం కార్యక్రమంలో భాగంగా పది వేల మందిని కలిశామని తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధికి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ నెల రోజుల పాటు పోరాటం నిర్వహించామని, పాలకుల విధానాలకు నిరసనగా ఆదోని నుంచి కర్నూలు వరకూ వారం రోజుల పాటు మహా పాదయాత్ర నిర్వహించామని కర్నూలు ప్రతినిధులు అంజిబాబు, ఆనంద్‌బాబు వివరించారు. వెనుకబడిన ప్రాంతమైన ఆదోనిలో ప్రత్యేకంగా జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సమీక్షా సమావేశం నిర్వహించే విధంగా పాదయాత్ర ఉపయోగపడిందని తెలిపారు. జిల్లాలో సామాజిక, వర్గ ఉద్యమాల వల్ల కొన్ని కొత్త ప్రాంతాలకు ఉద్యమం విస్తరించిందని వివరించారు. జిల్లాలో అంటరానితనం బలంగా ఉందని తెలిపారు. అనుగొండ, సందెకుడ్లూరు, నందికొక్కూరు, గురజాల తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న కులవివక్ష, అంటరానితనంపై పోరాటాలు నిర్వహించామని, ఈ పోరాటాల్లో రాష్ట్ర కార్యదర్శి కూడా పాల్గొన్నారని తెలిపారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో వాటిని తొలగించినట్లు చెప్పారు.
ప్రజారక్షణ భేరి క్యాంపెయిన్‌లో యువతను భాగస్వామ్యం చేశామని, జనం కోసం సిపిఎం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లగలిగామని, ఇది విజయవాడ నగర ఉద్యమానికి బాగా ఉపయోగపడిందని ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధులు ఎన్‌జిహెచ్ శ్రీనివాస్, కృష్ణా తెలిపారు. కృష్ణా కరకట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సుదీర్ఘ పోరాటం ఫలితంగానే రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగిందన్నారు. అయితే, మేమంటే మేమని అధికార, ప్రతిపక్ష పార్టీలు చెప్పుకుంటున్నాయని తెలిపారు. విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తిన సమయంలో పార్టీ కార్యకర్తలు అనేకమంది ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చారని, దాదాపు 15 రోజుల పాటు 15 సెంటర్లలో సేవా కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. కిడ్నీ వ్యాధితో ఎ.కొండూరు తండాలోని ప్రజలు చనిపోతుంటే… ఇక్కడ ఐదు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు, వాటర్ ట్యాంక్‌ల ద్వారా మంచినీరు సరఫరా సిపిఎం పోరాట ఫలితమేనని తెలిపారు.
టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజధాని ప్రాంతంలో లేరన్న నెపంతో మున్సిపల్ కార్మికులను పనులకు రాకుండా అడ్డుకున్నారని, దీనిపై 72 రోజుల పాటు పారిశుధ్య కార్మికులు పోరాడిన ఫలితంగా వారందరినీ విధుల్లోకి తీసుకున్నారని గుంటూరు జిల్లా ప్రతినిధులు అప్పారావు, భావన్నారాయణ, నాయక్ తెలిపారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమించినట్లు చెప్పారు.
పల్నాడు జిల్లా ప్రతినిధి గోపాల్‌రావు మాట్లాడుతూ చెత్త పన్నుకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నిర్వహించామని తెలిపారు. దళిత ప్రజాప్రతినిధులకు అండగా నిలచామని, జిల్లాలో ప్రాంతాల వారీగా ఉద్యమాల ద్వారా ఫలితాలు సాధించామని తెలిపారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించామని విశాఖ ప్రతినిధులు కుమార్, పద్మ తెలిపారు. 1450 రోజులుగా ఉక్కు
రక్షణ దీక్షలు సాగుతున్నాయని, దీంతో ప్రైవేటీకరణపై కేంద్రం ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయిందని వివరించారు. విశాఖ డెయిరీ ఉద్యోగులు, గంగవరం పోర్టు కార్మికులు, నిర్వాసితుల సమస్యలపై ఆందోళనలు చేపట్టామని, విజయాలు సాధించామని తెలిపారు. పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 125 రోజులుగా ఉద్యమిస్తున్నామని చెప్పారు.
గత మూడేళ్లలో కార్మిక, గిరిజన, వ్యవసాయ కార్మిక, రైతు రంగంలో గుర్తించదగిన కృషి చేశామని ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా ప్రతినిధులు ఆర్.లింగరాజు, పి.రామకృష, బి.వాసుదేవరావు, కె.నాగేశ్వరరావు తెలిపారు. ప్రధానంగా ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులకు అండగా నిలిచి కార్మికులకు, వారి కుటుంబాలకు నష్టపరిహారాలు ఇప్పించామని చెప్పారు. ఇటీవల పెచ్చుమీరుతున్న మతోన్మాద చర్యలను అడ్డుకునే ప్రయత్నం జరిగిందన్నారు. విశాల వేదికల ద్వారా అన్ని రంగాల ప్రజలను మమేకం చేసే ప్రయత్నం చేశామని వివరించారు. పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో గ్రీన్‌కో ప్రాజెక్ట్ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని తహశీల్దార్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ‘చలో పిన్నాపురం’ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా రాత్రికి రాత్రే నాయకులను అరెస్టు చేశారని, అరెస్టులకు వ్యతిరేకంగా ధర్నా చేశామని, నిరసనలు తెలిపామని నంద్యాల జిల్లా ప్రతినిధులు నాగరాజు వివరించారు.
గరుగుబిల్లి మండలం శివ్వాం దళితులపై దాడికి నిరసనగా ఆందోళనల ఫలితంగా పెత్తందార్లపై ఎస్‌సి, ఎస్‌టి కేసు నమోదైందని పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధులు ఇందిర, నాయుడు తెలిపారు. పాచిపెంట మండలం కుడుమూరులో 784 ఎకరాల అన్యాక్రాంత భూములను పంచాలని పోరాడామని, గిరిజనుల పోడు భూములకు పట్టాలివ్వాలని ఉద్యమాలు నిర్వహించామని చెప్పారు.
జిఒ 3ని పునరుద్ధరించాలని, ఏజెన్సీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్‌సి నిర్వహించి వంద శాతం ఖాళీలను ఆదివాసీలతోనే భర్తీ చేయాలని ఆందోళనలు నిర్వహించామని ఎఎస్‌ఆర్ పాడేరు జిల్లా ప్రతినిధులు కె.త్రినాథ్ తెలిపారు. కాఫీ, జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్యమాలు నిర్వహించినట్లు చెప్పారు.
పోలవరం నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని, గ్రామాలు ఖాళీ చేసే నాటికి 18 ఏళ్లు నిండిన యువతీయువకులకు సహాయ పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని, ముంపు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించామని ఎఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లా ప్రతినిధులు వెంకట్, పి.సంతోష్ తెలిపారు. పోడు భూముల హక్కుదార్లకు పట్టాలివ్వాలని రంపచోడవరం, చింతూరు ఐటిడిఎ కేంద్రాల వద్ద ఆందోళన నిర్వహించామని వివరించారు. జిఒ నెంబర్ 3ని పునరుద్ధరించి గిరిజన ప్రాంతంలోని వంద శాతం పోస్టులను గిరిజనులతోనే భర్తీ చేయాలని ఉద్యమించినట్లు తెలిపారు. మణిపూర్ ప్రాంతంలో ఆదివాసీలపైన, క్రిస్టియన్లపైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించామని చెప్పారు. కాకినాడ జిల్లా ప్రతినిధి ప్రసాద్ మాట్లాడుతూ జీడి పిక్కల కార్మికులు 68 రోజుల పాటు సమ్మె చేసి సంతృప్తికరమైన ప్యాకేజీ సాధించుకున్నారని వివరించారు. కాలుష్యం, భూ సేకరణ సమస్యలపై కృషి పెంచాల్సి ఉందన్నారు.
విజయనగరం జిల్లా ప్రతినిధి టివి.రమణ మాట్లాడుతూ గొర్రెల కాపరుల భృతికి ఆధారంగా ఉన్న ప్రభుత్వ భూమిని కృషి పరిశోధనా కేంద్రానికి కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యాన ఆరు నెలల పాటు పోరాడి అడ్డుకున్నామని తెలిపారు. దీనివల్ల 150 కుటుంబాల భృతి పోకుండా కాపాడామని చెప్పారు. పరిశోధనా కేంద్రాన్ని మరొక చోటకు మార్చారని తెలిపారు. విజయనగరం పట్టణం చుట్టూ ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ల వల్ల ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో బోరు బావులు ఎండిపోతున్నాదని, దీంతో, ఆరు నెలల పాటు పోరాడి 40 ప్లాంట్లను మూసివేయించగలిగామని తెలిపారు.
చిత్తూరు జిల్లా ప్రతినిధి వి.నాగరాజు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో జైలు సూపరింటెండెండ్ ఇంట్లో దళిత మహిళ దొంగతనం చేసిందంటూ ‘జై భీమ్’ సినిమా తరహాలో పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని, దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడంతో ఆ అధికారిపై కేసు నమోదైందని వివరించారు. ఏనాదుల భూములను అగ్రకులస్తులు ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన పోరాటం విజయవంతమైందన్నారు. అధికారులు సర్వే నిర్వహించి 59 ఎకరాలు ప్రభుత్వ భూమిని తేల్చి అక్కడ యానాదులకు స్కూలు, హాస్టల్ పెట్టడానికి ప్రతిపాదించారని వివరించారు. సత్యసాయి జిల్లా ప్రతినిధి జిఎల్ నరసింహ మాట్లాడుతూ పేదలకు భూమి, ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు నిర్వహించామని తెలిపారు. దీనివల్ల ప్రజాసంఘాల సభ్యత్వం పెరిగిందన్నారు.