‘శ్రమకావ్యం’ గాన సభలో వక్తలు
అలరించిన అశోక్‌తేజ గానం
ప్రజాశక్తి-తిరుపతి సిటీ : ‘శ్రమ జగతికి మూలం.. కష్టానికి తగ్గ విలువ రావాలి’ అని పలువురు వక్తలు ‘శ్రమకావ్యం’ గాన సభలో ఉద్ఘాటించారు. తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్ తేజతో ‘శ్రమ కావ్యం’ గానం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సంస్థ కార్యదర్శి మల్లారపు నాగార్జున అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సుద్దాల అశోక్‌తేజ హాజరై మాట్లాడారు. 2016లో ‘శ్రమకావ్యం’ రాశానని, దానికి బీజం అంతకు పది సంవత్సరాల ముందే పుట్టిందని తెలిపారు. తాను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో భవన నిర్మాణ మేస్త్రీ వద్ద అసిస్టెంట్‌గా పని చేశానని, శని.. ఆదివారాల్లో కూలి పనులకు వెళ్లి వచ్చే డబ్బుతో చదువుకున్నానని తెలిపారు. అప్పుడే తనకు శ్రమ గొప్పతనం తెలిసిందని, అప్పటి నుంచి శ్రమజీవులపై పాటలు, కవితలు రాస్తూనే ఉన్నానన్నారు. ప్రేమపై ఇప్పటి వరకు సినీ గేయాలలో పది వేల పాటలు వచ్చి ఉంటాయని, జీవితంలో ప్రేమ ఒక భాగమని, జీవితంలో గొప్పది శ్రమ అని వివరించారు. భూమి పుట్టినప్పటి నుంచి ఎన్ని చెమట చుక్కలు భూమిపై రాలి ఉంటాయో, వాటన్నిటికీ లెక్కలు కడితే శ్రమపై ఎన్ని లక్షల కోట్లు పాటలు రావాలని అన్నారు. ఆ ఆలోచనే తన కావ్యానికి పునాది వేసిందని తెలిపారు. తాను రచించిన శ్రమ కావ్యాన్ని తానే గానం చేసి ప్రేక్షకులను అలరింపజేశారు. మరో ముఖ్య అతిథి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ.. విశాఖపట్నంలో మొదటిసారిగా శ్రమ కావ్యం గానం ఏర్పాటు చేశామన్నారు. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 57 కావ్య గానాలు జరిగాయని తెలిపారు. శ్రమ జగతికి మూలమని, ఇది జగమెరిగిన సత్యమని చెప్పారు. మన పాలకులు ఆదాని, అంబానిలే మూలం అనేలా వ్యవహరిస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ.. శ్రమను గుర్తిస్తూ సుద్దాల అశోక్ తేజ రచించిన శ్రమ కావ్య గానాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సభాధ్యక్షులు మల్లారపు నాగార్జున మాట్లాడుతూ 58వ శ్రమ కావ్య గానాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. సమాజ పరిణామక్రమాన్ని అణువణువునా అధ్యయనం చేసి సుద్దాల అశోక్ తేజ శ్రమకావ్యం రచించారన్నారు. ఈ కార్యక్రమంలో వేమన విజ్ఞాన కేంద్రం గౌరవ అధ్యక్షులు టెంకాయల దామోదరం, సుద్దాల అశోక్ తేజ సతీమణి నిర్మల పాల్గన్నారు.
