వలంటీర్ల ఆత్మీయ ఆతిథ్యం

  • అశేష సేవలందించిన 200 మంది

ప్రజాశక్తి – కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నగర్‌ (నెల్లూరు) : సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతోంది. మూడు రోజులపాటు జరుగుతున్న మహాసభలో 200 మంది వలంటీర్లు ఆత్మీయంగా, ఆప్యాయంగా సేవలందించారు. ఇంటికి బంధువులు వచ్చినట్లు మర్యాదలు చేశారు. బస్సులు, రైళ్లలో నెల్లూరు చేరుకున్న ప్రతినిధులకు రెడ్‌ సెల్యూట్‌ కామ్రేడ్స్‌ అంటూ నవ్వుతూ స్వాగతం పలికారు.. వసతి సౌకర్యం చూపించడంలోనూ.. భోజనాలు వడ్డించడంలోనూ.. రవాణా సౌకర్యం కల్పించడంలోనూ వారి మర్యాదలు ప్రతినిధులు మర్చిపోరు. నెల్లూరు నగరంలో ఎర్రజెండా తోరణాలు, సిపిఎం పార్టీ అగ్ర నేతల ఫ్లెక్సీలు అదుర్స్‌.. నగరంలో ఎక్కడ చూసినా ఎర్రజెండా పండగే… ఆ విధంగా వలంటీర్లు ముస్తాబు చేశారు.. ఈ టీమ్‌కు సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ నాయకత్వం వహించారు. భోజనం దగ్గర 60 మంది, రిసెప్షన్‌ వద్ద 12 మంది, వసతి వద్ద 50 మంది, బహిరంగ సభ ఆవరణలో 40 మంది, సోషల్‌ మీడియాలో ఎనిమిదిమంది, సమావేశ మందిరంలో 30 మంది వలంటీర్లు సేవలందించారు. మహాసభల విజయవంతానికి నెల రోజుల ముందే సిపిఎం జిల్లా నాయకత్వం 15 టీములు ఏర్పాటు చేసింది. సమావేశ మందిరానికి టీమ్‌ లీడర్‌గా నాగేశ్వరరావు వ్యవహరించారు. ఫుడ్‌ కమిటీకి తుళ్లూరు గోపాల్‌, రిసెప్షన్‌కి పి.రాములు, సోషల్‌ మీడియాకు ఎం.మోహన్‌ రావు, అకామిడేషన్‌కి అజరు కుమార్‌, గోకుల శీనయ్య, సాంస్కృతిక విభాగానికి ఎం పుల్లయ్య, రవాణా విభాగానికి మాదాల వెంకటేశ్వర్లు, టివి ప్రసాద్‌, డెకరేషన్‌కి సూర్యనారాయణ, ఆర్‌ శ్రీనివాసులు బహిరంగ సభకు ఆర్‌ శ్రీనివాస్‌, మూలం ప్రసాద్‌, కత్తి శ్రీనివాస్‌ నాయకత్వం వహించారు.

➡️