రాష్ట్ర ప్రభుత్వం కార్మికవర్గ సంక్షేమానికి ఒక్క అడుగైనా వేయలేదు

 సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ సరసింగరావు
ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) : రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా కార్మిక వర్గ సంక్షేమానికి ఒక్క అడుగైనా ముందుకు వేయలేదని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు విమర్శించారు. గత రెండ్రోజులుగా జరుగుతున్న సిఐటియు సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన నర్సింగరావు ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగ సంస్థల్లో, కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ విధానాల్లో లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేసేందుకూ ప్రభుత్వం ముందుకు రాలేదని తెలిపారు. గత ప్రభుత్వం కార్మిక వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడి వర్కర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్‌ వర్కర్లు, పెద్ద ఎత్తున పోరాటం చేశారని గుర్తు చేశారు. మీకు న్యాయం చేస్తామని నాడు ఆ టెంట్లు చుట్టూ తిరిగిన టిడిపి, జనసేన నాయకులు.. ఇచ్చిన హామీల సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం రాగానే తొలి సంతకం బిల్డింగ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కార్మిక శాఖ మంత్రి ప్రకటించారని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని అన్నారు. అప్పుడు విజన్‌ 2020తో పేదరికం నిర్మూలన అవుతుందని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు విజన్‌ 2047 అంటున్నారని విమర్శించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సంగతేంటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేటీకరణ అంశంపై స్పష్టంగా చెప్పటం లేదని పారిశ్రామికవేత్త మిట్టల్‌కు మాత్రం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు క్యాప్టివ్‌ మైన్స్‌ ఇస్తామంటూ ప్రకటించడం ఏంటో ప్రజలకు తెలియజేయాలన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. మే 20వ తేదీ సార్వత్రిక సమ్మె అనంతరం రాష్ట్రంలో ఉద్యోగ కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్దమవుతుందని తెలిపారు. సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు నాయక్‌, జిల్లా నాయకులు పాల్గన్నారు.

➡️