మాజీ చైర్మన్ భూమన
గోవుల మృతి వాస్తవం కాదు : టిటిడి
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను టిడిపి కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని, మూడు నెలల కాలంలో గోశాలలో వంద గోవులు మృత్యువాత పడ్డాయని, దీనిపై విచారణ జరపాలని టిటిడి మాజీ చైౖర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ తమ పాలనలో దాతల సహకారంతో 500 గోవులను గోశాలకు తీసుకొచ్చామని, వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు. వాటికి ఆహారం సరిగ్గా లేక గోవులతో పాటు, లేగదూడలు మృతి చెందాయని చెప్పారు. ఈ విషయంలో ఇప్పటివరకూ డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపి టిటిడి వివరణ ఇస్తూ గోశాలలో గోవులు వందకు పైగా మరణించాయని కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అవాస్తవమని తెలిపింది. దురుద్దేశంతో కొంతమంది ఎక్కడో మృతి చెందిన గోవులు గోశాలలో మృతి చెందాయని చూపడం వల్ల యాత్రికుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపారు. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయొద్దని టిటిడి కోరింది.
గోవుల మృతిపై విచారణ జరపించాలి : సిపిఎం
టిటిడి గోశాలలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కువ సంఖ్యలో గోవులు మృతి చెందాయని వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి నాగరాజు ఓ ప్రకటనలో కోరారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అవాస్తవమని టిటిడి పేర్కొంతుందని, వాటిపై సమగ్ర విచారణ జరిపి యాత్రికులకు నిజానిజాలు తెలపాలని కోరారు.