రాష్ట్రానికి మరోసారి ద్రోహం

  • బడ్జెట్‌పై నిరసనలకు సిపిఎం పిలుపు
  • రాష్ట్ర మహాసభ తీర్మానం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నగర్‌ (నెల్లూరు) : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మరోసారి రాష్ట్రానికి ద్రోహం చేసిందని సిపిఎం విమర్శించింది. ఆ ద్రోహానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు నెల్లూరులోని సీతారాం ఏచూరి నగర్‌లో జరుగుతున్న ఆ పార్టీ 27వ రాష్ట్ర మహాసభ తీర్మానం చేసింది. విభజన చట్టం ప్రకారం వచ్చిన ఏ జాతీయ విద్యాసంస్థకూ కేటాయింపులు చేయలేదని, విశాఖ రైల్వే జోన్‌, ఎన్‌ఐటి, ఐఐటి, ఐఐఎం, త్రిపుల్‌ ఐటి, ఐఐఎస్‌ఇఆర్‌, గిరిజన, సెంట్రల్‌ యూనివర్సిటీలకు, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ప్లాంట్‌, వైజాగ్‌ మెట్రో, ఎయిమ్స్‌, వెనుకబడిన జిల్లాల నిధులు, రాజధాని నిర్మాణానికి నిధుల గురించి ఊసేలేదని తెలిపింది. రాజధాని నిర్మాణానికి గతంలో ప్రకటించిన ప్రపంచ బ్యాంక్‌ రుణాన్నే పదేపదే ప్రస్తావించారే తప్ప కొత్తగా కేటాయింపు లేదని విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్‌ చేసింది. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీల ఎంపిలు కేంద్రాన్ని నిలదీయాలని కోరింది. అయితే మరోవైపు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు గతేడాది రూ.8,622 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత బడ్జెట్‌లో రూ.3,295 కోట్లు కేటాయించిందని పేర్కొంది. అంటే గతేడాది కంటే బడ్జెట్‌లో రూ.5,327 కోట్లను తగ్గించిందని తెలిపింది. అర్భాటంగా ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రస్తావన లేదని వెల్లడించింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదల గురించి మాట్లాడకపోవడం మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. విభజన హామీల్లో భాగంగా ఉన్న కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావనా లేదని తెలిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రాన్ని ఈ బడ్జెట్‌ గాలికొదిలేసిందని విమర్శించింది. పోలవరం ప్రాజెక్టుకు గతేడాది రూ.5,512.50 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.5,936 కోట్లు కేటాయించిందని పేర్కొంది. అయితే పునరావాసం, పరిహారం ప్యాకేజ్‌ గురించి స్పందించలేదని వెల్లడించింది. రూ.55 వేలకోట్ల తాజా అంచనాలకు రూ.33 వేలకోట్లు తగ్గిందని తెలిపింది. నిర్వాసితులకు కోత విధించడానికి ప్రభుత్వం సిద్ధపడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహంపై ప్రజలు నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చింది.

➡️