ప్రజాశక్తి- నెల్లూరులోని సీతారాం ఏచూరి నగర్ : రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన ఐదు పతాక జాతాలకు శనివారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ ఘనస్వాగతం పలికారు. తొలుత జనవరి 28న విశాఖలోని కూర్మన్నపాలెంలో ప్రారంభమైన విశాఖ స్టీల్‌ప్లాంట్ రక్షణ జాతా కాగడాను విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు యు.రామస్వామి నాయకత్వంలో బి.గుర్రప్ప, మహేష్, శ్రీనివాసరావు… సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబికి మహాసభ ప్రాంగణంలో అందజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించరాదని, సొంత గనులు కేటాయించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని నినాదాలు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం బొజ్జరాయిగూడెం నుంచి జనవరి 29న ప్రారంభమైన పోలవరం నిర్వాసితుల పోరాట పతాక జాతాకు నాయకత్వం వహించిన సిపిఎం ఎఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లోతా రామారావు, ఈ బృందం సభ్యులు సుబ్బారావు…. తాజా పతాకాన్ని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులుకు అందించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలన్న నినాదాలు హోరెత్తాయి. ‘రాజధాని నిర్మాణం-రాష్ట్ర అభివృద్ధి’ పేరుతో గుంటూరు జిల్లా తాడేపల్లిలో జనవరి 30న ప్రారంభమైన అమరావతి జాతా జెండాను గుంటూరు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, సభ్యులు ఎ.రవి, బి.వెంకటేశ్వర్లు… కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలని, రాజధానికి భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చూడాలనే నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. చేశారు. ‘సెకీ ఒప్పందం రద్దు చేయాలని, కరెంట్ యూజర్, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ నంద్యాలలో జనవరి 30న ప్రారంభమైన జాతా జెండాను సిపిఎం నాయకులు నాగరాజు నేతృత్వంలో సిపిఎం సీనియర్ నాయకులు పి.మధుకు అందించారు. ‘కడప ఉక్కు.- ఆంధ్రుల హక్కు’ అంటూ జనవరి 30 నుంచి వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు నుంచి ప్రారంభమైన జాతా పతాకాన్ని సిపిఎం నాయకులు చంద్రశేఖర్, రామన్న, అన్వేష్, చాంద్‌బాషా నేతృత్వంలో సిపిఎం అఖిల భారత నాయకులు బి.వెంకట్‌కు అందజేశారు.
అనంతరం పతాకావిష్కరణ జరిగింది. ఆ తర్వాత అమరవీరుల స్థూపం వద్ద ప్రతినిధులు జోహార్లు అర్పించారు.
