రాష్ట్రాన్ని అదానీ ప్రదేశ్‌గా మార్చారు

కార్పొరేట్ల కోసమే జమిలి ఎన్నికలు : వి శ్రీనివాసరావు
చీమకుర్తిలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ
ప్రజాశక్తి- చీమకుర్తి (ప్రకాశం జిల్లా) : కేంద్ర, రాష్ట్ర పాలకులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అదానీ ప్రదేశ్‌గా మార్చారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం ప్రకాశం జిల్లా 14వ మహాసభలో భాగంగా చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మండపం ప్రాంగణం (కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నగర్‌)లో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రపంచాన్ని అదానీ అవినీతి కుదిపేస్తోందని, భారత ప్రతిష్టను అమెరికాలో తాకట్టు పెట్టారని వివరించారు. రాష్ట్రంలో ప్రకృతి వనరులన్నీ అదానీకి తాకట్టు పెట్టడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో మోదానీ పాలన సాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అదానీ కబ్జా చేశారని తెలిపారు. పోర్టులు అదానీ పరమయ్యాయని, వేలాది ఎకరాలు అదానీకి కట్టబెడుతున్నారని వివరించారు. మోడీ గత పదేళ్లుగా చెప్పిన ఒక్క వాగ్దానాన్నీ నెరవేర్చలేదన్నారు. కార్పొరేట్ల కోసమే జమిలి ఎన్నికలను తెచ్చేందుకు మోడీ చూస్తున్నారని పేర్కొన్నారు. జమిలి ఎన్నికల వల్ల ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, ఖర్చులు, భారాలు ప్రజలపై పెరుగుతాయని తెలిపారు. అధ్యక్ష తరహా పాలన కోసం మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీల ఉనికికే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. జమిలి ఎన్నికలకు టిడిపి, వైసిపి మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములు కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని, ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పలేదని, ఒక్క ఉద్యోగం కూడా రాలేదని వివరించారు. స్మార్ట్‌ మీటర్లను పగలగొట్టండని యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ పిలుపునిచ్చారని, అయితే, టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్‌ మీటర్లను ఎందుకు బిగిస్తున్నారని ప్రశ్నించారు. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు ఊసే లేదని, మెగా డిఎస్‌సిపై చంద్రబాబు మొదటి సంతకం చేసి ఆరు నెలలైనా, ఎక్కడి ఫైలు అక్కడే ఉందని అన్నారు. ఇంటింటికీ ఉద్యోగం పిలుపుపోయి, ఇప్పుడు ఇంటింటికీ పారిశ్రామికవేత్త నినాదం చేస్తున్నారని, ఇది వినడానికి విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. మ్యాజిక్‌ పాలన చేయాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజల ఆదాయం పెరిగితేనే రాష్ట్రం బాగుపడుతుందని తెలిపారు. గతంలో జగన్‌ పాలనకు, నేటి చంద్రబాబు పాలనకు ఏ మాత్రమూ తేడాలేదని వివరించారు. జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందన్నారు. మూడు లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ ప్రవేశపెట్టి దానిలో రూ.350 కోట్లు మాత్రమే వెలిగొండకు కేటాయించారని, ఇలా అయితే ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో పదేళ్లు పడుతుందని తెలిపారు. వెలిగొండ సంక్రాంతికి పూర్తవుతుందని గతంలో టిడిపి చెప్పేదని, జగన్‌ అధికారంలో ఉండగా ఉగాదికి పూర్తవుతుందని చెప్పేవారని, అసలు ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టతే లేదని పేర్కొన్నారు. అసమానతలులేని సమాజం కోసం సిపిఎం పోరాడుతోందన్నారు. హక్కుల కోసం పోరాటాలను ఉధృతం చేస్తామని తెలిపారు. సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్‌డి హనీఫ్‌ అధ్యక్షత వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, కె.సుబ్బరావమ్మ, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ఉమామహేశ్వరరావు, పూనాటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

భారీ ప్రదర్శన
సభకు ముందు చీమకుర్తిలో భారీ ప్రదర్శన జరిగింది. ఆర్‌టిసి బస్టాండ్‌ సెంటర్‌ నుంచి బూచేపల్లి కల్యాణ మండపం వరకు ఈ ప్రదర్శన సాగింది. దీంతో, చీమకుర్తి ఎరుపెక్కింది. ప్రధాన ముందు భాగాన ఎర్రని జెండాలు చేతబూని మహిళలు కవాతు చేశారు.
రోడ్డుకు ఇరువైపులా ఎర్రని తోరణాలు, ఎర్ర దుస్తులతో మహిళలు, నాయకుల ప్రదర్శన ఆకట్టుకుంది. డప్పు వాయిద్యాలు, మహిళల కోలాటాల నడుమ ప్రదర్శన ఉత్సాహపూరితంగా సాగింది. వాహనాలపై లెనిన్‌తోపాటు మోడీ, అదానీ విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో పాడిన అభ్యుదయ గేయాలు అలరించాయి. ప్రజానాట్యమండలి నాయకులు వేదికపై నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

➡️