కేంద్ర సహకారంతో సమస్యను పరిష్కరిస్తాం
ఎపిలో దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని నిలబెడతాం
రైల్వే జోన్‌కు స్థలాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం
విశాఖ ఎంపి శ్రీభరత్ వెల్లడి
ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరో : ‘వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పూర్తి స్థాయి సామర్థ్యంతో నడవడం లేదు. అప్పుల్లో కూరుకుపోయింది. సుమారు రూ.20 వేల కోట్ల మేర అప్పులున్నాయి, రోజు వారీగా నడపాలన్నా డబ్బుల్లేవు. ప్లాంట్ విస్తరణ సమయంలో జరిగిన ఖర్చు ఇబ్బంది వైపు నడిపిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైనే దీని భవిష్యత్ ఆధారపడి ఉంది. కేంద్ర సహకారంతో స్టీల్‌ప్లాంట్ సమస్యను టిడిపి కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుంది. సెయిల్‌లో విలీనం చేయాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నాం’ – అని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం.శ్రీభరత్ వెల్లడించారు. విశాఖ టిడిపి కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ, దక్షిణ నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి సీతంరాజు సుధాకర్‌లతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రాష్ట్రంలో తమ ప్రభుత్వం అనుసరించే విధానంపై మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌పై తాను లిఖిత పూర్వక హామీ గతంలో ఇచ్చానని, అందుకనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేసి ప్లాంట్‌ను కాపాడతామని, అయితే తాము ఒక్కరమే లేమని, కూటమిలో భాగంగా ఉన్నామని, కూటమి కేంద్రంలో ఉందని గుర్తుచేశారు.
రైల్వే జోన్‌పై ఏమన్నారంటే..
రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటు కోసం గత ప్రభుత్వం సరైన స్థలం ఇవ్వలేదని తాము స్థలాన్ని అందించే ప్రయత్నం చేస్తామని అన్నారు. వైజాగ్ స్టేషన్ అభివృద్ధికి మోడీ గతంలో వర్చువల్‌గా రూ.600 కోట్లతో పనులు ప్రారంభించారని, వీటికి బిడ్డింగ్ దశ పూర్తయిందని అన్నారు. గత ప్రభుత్వం అన్ని రంగాలనూ దెబ్బతీసిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని తాము పూడ్చుతామన్నారు. ఇసుకను దోపిడీ చేసి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్నారు. ఐదేళ్లుగా చతికిల బడ్డ అన్ని వ్యవస్థలకు కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో పూర్వ వైభవం రానుందన్నారు. అలాగే రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు మంచి రోజులొచ్చాయన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం 40 వేల టన్నుల ఇసుకను అమ్మేసుకుని రూ.వేల కోట్లు దోచుకుందన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 రోజులకే మెగా డిఎస్సీ ఇచ్చిందన్నారు. పెంచిన పింఛనుతో పాటు రూ.7 వేలును అందించిందని తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.