స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి

Jun 10,2024 20:08 #Dharna, #visaka steel plant
  • విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ 

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్రం, రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వాలు పాటుపడాలని, ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, రామారావు, ఎన్‌.రామచంద్రరావు, శ్రీనివాసరావు కోరారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 1215వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ సింటర్‌ ప్లాంట్‌ కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ.. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానున్న ప్రధానీ మోడీ ఉక్కు ప్రయివేటీకరణను విరమించుకుంటున్నట్టు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్థిక ప్రయోజనాలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖకు రైల్వే జోన్‌, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి వంటి అంశాలపైనా స్పందించాలని కోరారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్న నేతలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా పనిచేయాలన్నారు. కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టిన తర్వాత లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కును నష్టాలవైపు ఎలా నడిపిందో వివరించారు. దీక్షల్లో నాయకులు గుమ్మడి నరేంద్ర, దాసరి శ్రీనివాస్‌ నాయుడు, జగదీష్‌, సత్యనారాయణ, కామేశ్వరరావు, రామానాయుడు పాల్గొన్నారు.

➡️