- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయనున్నట్టు విశాఖ వస్తున్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెంలో కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 1245వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ విభాగ కార్మికులు కూర్చున్నారు. దీక్షలనుద్దేశించి పోరాట కమిటీ నేతలు డి.ఆదినారాయణ, ఎన్.రామారావు, వరసాల శ్రీనివాసరావు, యు.రామస్వామి తదితరులు మాట్లాడారు. వర్కింగ్ క్యాపిటల్‌కు ఆర్థిక పరిపుష్టి కల్పించాలని, పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి తీసేందుకు రా మెటీరియల్స్ సమకూర్చాలని, వడ్డీపై రెండేళ్లు మారటోరియం విధించాలని, నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఎనిమిది వేల మంది నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని, ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందజేయాలని, కేంద్రం ఆంక్షలతో కోల్పోయిన ఉద్యోగులు, అధికారుల ఆర్థిక ప్రయోజనాలు, ప్రమోషన్లపై సానుకూల నిర్ణయం ప్రకటించాలని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న కంపెనీ భూములు, ఆస్తుల అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బిజెపి కారణంగానే విశాఖ ఉక్కు నష్టాల్లోకి వెళ్లిపోయిందని తెలిపారు. దీక్షల్లో రైతు కూలీ సంఘం నేత రామారావు, దాసరి శ్రీనివాస్, కామేశ్వరరావు, కోటేశ్వరావు, వెంకటరావు, కె.మధుసూదనరావు, కె.అప్పారావు, జి.వేణుగోపాలరావు, సుబ్బయ్య, శ్రీనివాస్‌నాయుడు పాల్గొన్నారు.