- రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి- నెల్లూరు : సిపిఎంను బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. దున్నే వానికి భూమి, పేదలకు ఇళ్ల స్థలాలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 276 గ్రామాల్లో భూ పోరాటాలు నిర్వహించి సుమారు 70 వేల ఎకరాల భూమిని నిరుపేదలకు పంపిణీ చేసిన ఏకైక పార్టీ సిపిఎం అని తెలిపారు. అటువంటి పార్టీ బలోపేతం అయితే రాష్ట్రాభివృద్దికి పునాది అవుతుందని తెలిపారు. నెల్లూరు నగరంలో ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జరగనున్న సిపిఎం 27వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ప్రచార జాతాను ముత్తుకూరు గేట్ సెంటర్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు షేక్ రెహనా బేగంతో కలిసి జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర మహాసభకు 700 మంది ప్రతినిధులు, నాయకులు హాజరు కానున్నారని తెలిపారు. అఖిల భారత కేంద్రం నుంచి ఎంఎ బేబీ, బృందా కరత్, బివి.రాఘవులు వంటి ప్రధాన నాయకులు హాజరై దిశ నిర్దేశం చేస్తారని చెప్పారు. నెల్లూరులోని అనిల్ గార్డెన్స్‌లో జరిగే మహాసపభను జయప్రదం చేయాలని కోరుతూ కోటమిట్ట షాదీ మంజిల్ సెంటర్లో సిపిఎం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఐదు దళాలుగా ఏర్పడి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి మహాసభ ప్రాధాన్యతను వివరించారు. ప్రచార జాతాలో పాల్గొంటున్న ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు వేణు, కార్యదర్శి జి.శేషయ్య, సభ్యులు విజరుకుమార్, రామ్మోహన్, గోపి, శంకరయ్య, ఎం.వి.రమణ, ఎన్.శ్రీకాంత్, భాషా, శివయ్య తదితరుల మెడలో పార్టీ కండువాను వి వెంకటేశ్వర్లు వేసి అభినందించారు.