- అగ్రీగోల్డ్ బాధితుల కన్నీటి దీక్షలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం నానబెడుతోంది. ఇప్పటి వరకు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నాం. త్వరితగతిన ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించకుంటే కార్యాచరణ రూపొందించి పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం’ అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ హెచ్చరించారు. చివరి బాధితునికి న్యాయం జరిగే వరకు విజయవాడలో ఇక్కడే ధర్నా చౌక్‌లోనే కూర్చుంటామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో బుధవారం ‘అగ్రీగోల్డ్ బాధితుల కన్నీటి దీక్షలు’ నిర్వహించారు. ఎపితో పాటు తెలంగాణ, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి అగ్రిగోల్డ్ బాధిత ఏజెంట్లు, డిపాజిటర్లు దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరాన్ని నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఇవి నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో నారాయణ మాట్లాడుతూ.. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో 32 లక్షల మంది డిపాజిటర్లను అగ్రిగోల్డ్ కంపెనీ మోసం చేసిందని తెలిపారు. డిపాజిటర్ల సొమ్ముతో అగ్రిగోల్ట్ కొన్న ఆస్తులు ప్రాథమికంగా రూ.20 వేలకోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసిందని తెలిపారు. అగ్రిగోల్డ్ సంస్థ యజమానులు వారి బినామీల పేరుతో ఉన్న ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని డిపాజిటర్ల సొమ్మును తిరిగి చెల్లించాలన్నారు. దీనికి సమర్ధవంతమైన అధికారుల బృందంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటుచేసి న్యాయపరమైన చిక్కులను సత్వరం తొలగించాలన్నారు. నివాసాలకు పనికొచ్చే అగ్రిగోల్డ్ ఆస్తులను చిన్నచిన్న ఇళ్ల స్థలాలు గానూ, వ్యవసాయ భూమలను చిన్నచిన్న కమతాలు గానూ విభజించి బాధితులకు వారి డిపాజిట్ల కింద కేటాయించాలని, బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు, ఉప ప్రధాన కార్యదర్శి వివి చంద్రశేఖరరావు తదితరులు పాల్గొని సభలో మాట్లాడారు.