- రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు
- 6న కలెక్టరేట్ల వద్ద ధర్నా
ప్రజాశక్తి – యంత్రాంగం : విద్యారంగ సమస్యలపై విద్యార్థి లోకం గళమెత్తింది. తల్లికి వందనం, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని, పెరిగిన ధర లకనుగుణంగా కాస్మోటిక్స్, మెస్‌ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేసింది. జిఒ నంబర్ 77 రద్దు చేయాలని, పిజి విద్యార్ధులకు స్కాలర్‌షిప్ సదుపాయం కల్పించాలని నినదించింది. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. పై సమస్యలపై నవంబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాను నిర్వహించనున్నారు.
విజయనగరంలో నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ర్యాలీ చేపట్టారు. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నలుగురు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను బలవంతంగా లాక్కెళ్లి ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విద్యార్థులంతా ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌కు వినతినిచ్చారు. అరెస్టయిన నాయకులను విడుదల చేశారు.
అల్లూరి జిల్లా అరకులోయ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి, వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ సంఘం జిల్లా అధ్య క్షులు కె.కార్తీక్ మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల్లో హెల్త్ అసిస్టెంట్లను నియమించకపోవడంతో రోజు రోజుకూ విద్యార్థుల మరణాలు పెరుగుతున్నాయన్నారు. విద్యార్థుల మరణాలపై సిట్టింగ్ జడ్జిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. కర్నూలులో అర్బన్ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ధర్నా, కొత్తపల్లి, బేతంచర్లలో ర్యాలీ చేపట్టారు. అనంతపురం జిల్లాలో గుంతకల్లు ఆర్‌డిఒ, ఉరవకొండలో తహశీల్దార్ కార్యాలయం, ఎస్‌కె యూనివర్సిటీ విసి, రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. పార్వతీపురం జిల్లా మక్కువ, జియ్యమ్మవలస, అల్లూరి జిల్లా పాడేరు, ఎన్‌టిఆర్ జిల్లాలో తిరువూరు, విస్సన్నపేట, ఎ కొండూరు, అన్నమయ్య జిల్లా సంబేపల్లి,పుల్లంపేట, కడప జిల్లా బద్వేలు, కర్నూలులో గూడూరు, మంత్రాలయం, కృష్ణ జిల్లాలో ఉయ్యూరు, గుడివాడ, బంటుమిల్లిలో నిరసనలు తెలిపారు. గత మూడురోజులుగా చేపట్టిన ఆందోళనలు విజయవంతమయ్యాయి.