- ఎపి కొబ్బరిరైతు సంఘం డిమాండ్
ప్రజాశక్తి-పూసపాటిరేగ(విజయనగరం జిల్లా) : క్వింటా కొబ్బరికి కనీస మద్దతుధర రూ.18 వేలు ప్రకటించాలని ఎపి కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గోవిందపురంలోని గీతా మందిర్ కల్యాణ మండపంలో గురువారం ఎపి కొబ్బరి రైతుల సంఘం (ఎపి రైతుసంఘం అనుబంధం) ఆధ్వర్యంలో కొబ్బరి రైతుల జిల్లా సదస్సు నిర్వహించారు. కొబ్బరి రైతు సంఘం నాయకులు ఎం ఎరకయ్యదొర అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో శ్రీనివాస్ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి క్వింటా బంతి కొబ్బరికి రూ.12 వేలు, మిల్లింగ్ కొబ్బరికి రూ.11,160 గా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. పెరిగిన ఖర్చుల రీత్యా కొబ్బరికి ప్రకటిస్తున్న మద్దతు ధర.. రైతుకు ఏమాత్రమూ గిట్టుబాటు కాదని చెప్పారు. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.18 వేలు ఉండాలని డిమాండ్ చేశారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. ఉద్దానం ప్రాంతంలో కొబ్బరిబోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసి రైతులకు సబ్సిడీ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. కొబ్బరి రైతుల సమస్యలపై ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్దరాజు రాంబాబు తీర్మానాలు ప్రవేశపెట్టగా, ఏకగ్రీవంగా ఆమోదించారు. సదస్సులో కోయర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి మొంగం శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి వి జగన్నాథం, పైడితల్లమ్మ కొబ్బరి ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి పి అప్పడుదొర, సిఐటియు జిల్లా కార్యదర్శి బి సూర్యనారాయణ, రైతు సంఘం నాయకులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.