‘ఉక్కు’పై టిడిపి కూటమి స్పష్టమైన వైఖరి ప్రకటించాలి

Jan 10,2025 22:27 #clear stand, #declare, #TDP alliance, #Ukku
  • విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణపై టిడిపి కూటమి పాలకులు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 1429వ రోజుకు చేరాయి. దీక్షా శిబిరంలో స్టీల్‌ ఎల్‌ఎంఎం, డబ్ల్యుఆర్‌ఎం -1, ఎంఎంఎస్‌ఎం, డబ్ల్యుఆర్‌ఎం – 2, ఎస్‌బిఎం, ఎస్‌టిఎం విభాగాల ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారాన్ని కాపాడతామని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసిన టిడిపి కూటమి నేతలు నేడు నోరు మెదకపోవడం దారుణమన్నారు. ఉక్కు పరిరక్షణ కోసం వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు అలుపెరగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. రానున్న కాలంలో ఉక్కు పరిరక్షణ పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మలిచి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. దీక్షల్లో నాయకులు ఎన్‌.రామారావు, వైటి.దాస్‌, డి.దేముడు, జి.ఆనంద్‌, డి.రమేష్‌, ఎంకెవి.రాజేశ్వరరావు, సిహెచ్‌.సన్యాసిరావు, దాసరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు .

➡️