- ప్రజాశక్తి విలేకరిపై టిడిపి నేత దాడి
- మంత్రిపై వార్తలు రాస్తే చంపుతానంటూ బెదిరింపులు
ప్రజాశక్తి – పార్వతీపురం : పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావుపై ఆ మండల టిడిపి అధ్యక్షులు, ఎ.వెంకంపేట గ్రామానికి చెందిన గుల్ల వేణుగోపాలనాయుడు దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ‘నిన్ను వదలను… ఎప్పటికైనా చంపేస్తాను’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ బెదింపు చర్యలకు పాల్పడ్డారు. మళ్లీ చెబుతున్నా ‘మా పార్టీపైగానీ, మా మంత్రిగారిపైగానీ వార్తలు రాస్తే…. మీ ఇంటికి వచ్చి చంపేస్తాను…. ఏమనుకుంటున్నావో నా సంగతి నీకు పూర్తిగా తెలియనట్టుంది. నీ భార్య, పిల్లలకు కూడా దక్కవు’ అంటూ విలేకరి తలపై కొట్టారు. విలేకరి తన విధి నిర్వహణలో భాగంగా మండలంలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు తెలుసుకునేందుకు ఆదివారం ఉదయం ఇంటి నుండి బయలుదేరారు. ఎ.వెంకంపేట – కాశీపట్నం మార్గమధ్యలో జరుగుతున్న నిర్మాణ పనుల వద్దకెళ్లారు. అప్పటికే అక్కడున్న వేణుగోపాలనాయుడిని పలకరించారు. రోడ్డు పనుల ఫొటో తీసుకుంటానంటూ వేణుగోపాలనాయుడి అనుమతి కోరారు. వేణుగోపాల నాయుడు ఇందుకు నిరాకరించడమే కాకుండా… వెంటనే బూతు పురాణం అందుకుని దుర్భాషలాడుతూ.. ‘మా మంత్రి గారిపైనే వార్తలు రాస్తావా? అంటూ అసభ్యకరమైన పదజాలంతో రామారావుపై దాడికి పాల్పడ్డారు. ‘నేను రాసింది మంత్రిపై కాదు… ఎన్నికల కోడ్ అమలు తీరుపైన’ అంటూ విలేకరి సముదాయించినప్పటికీ వేణుగోపాలనాయుడు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మాపైన వార్తలు రాయడానికి విలేకర్లంతా భయపడతారు… ఎవరికీ లేని బాధ నీకెందుకు’ అంటూ రామారావుపై దౌర్జన్యానికి దిగారు. దీంతో మక్కువ పోలీసు స్టేషన్‌లో వేణుగోపాల నాయుడిపై బాధితుడు రామారావు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేయడమే కాకుండా, చంపుతానంటూ బెదిరించిన వేణుగోపాలనాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వేణుగోపాలనాయుడి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఈ ఫిర్యాదులో కోరారు. టిడిపి నేత దాడి నేపథ్యంలో విలేకరి మల్యాడ రామారావును ప్రజాశక్తి ఎడిటర్ బి తులసీదాసు ఫోనులో పరామర్శించారు. ప్రజాశక్తి కుటుంబం, మిగతా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ప్రజాస్వామ్య శక్తులు సంఘీభావంగా నిలుస్తాయని ధైర్యం చెప్పారు. రామారావుపై దాడిని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన పలు జర్నలిస్టు సంఘాల నాయకులు ఖండించారు.
ఎపిడబ్ల్యుజెఎఫ్ ఖండన
మక్కువ మండల ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావుపై ఆ మండల టిడిపి అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ నాయుడు దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వెంకట్రావు, జి.ఆంజనేయులు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అధికార పార్టీ నాయకుల తప్పొప్పులను ప్రజలకు తెలియజేయడం ప్రజాస్వామ్యంలో పత్రికల ప్రధాన విధి అని, ఈ విధిని నిర్వహిస్తున్న విలేకరిపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్య అని, దీనిని ఫెడరేషన్ తరపున ఖండిస్తున్నామని పేర్కొన్నారు. టిడిపి నాయకుడు వేణుగోపాల్ నాయుడుపై తక్షణం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ దాడిని వ్యతిరేకిస్తూ ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు.