బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి-వైసిపి-జనసేన కూటమిని ఓడించాల్సిందే : వి.శ్రీనివాసరావు

విజయవాడ : రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి-వైసిపి-జనసేన కూటమిని రాబోయే ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం ‘ సిపిఎం జన శంఖారావం ‘ విజయవాడ పాయకాపురం ప్రకాష్‌నగర్‌ సెంటర్‌లో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ … రాజధాని కోసం వేల ఎకరాల భూములను తీసుకున్నారని అన్నారు. రైతుల భూములూ పోయాయి.. రాజధాని కూడా ఏర్పాటు కాలేదని విమర్శించారు. ప్రస్తుత రాజధాని దుస్థితికి తెలుగుదేశం, వైసిపిలు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. రైతుల భూములను లాక్కొని తెలుగుదేశం రైతులకు నష్టం చేస్తే, అసలు రాజధానే లేకుండా చేసిన ఘనత వైసిపిది అని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి-వైసిపి-జనసేన కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారన్నారు. రాష్ట్రానికి బిజెపి ద్రోహం చేస్తే … ఆ బిజెపితో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ …. వైసిపి-టిడిపి-జనసేనలు ఎపిలో కుస్తీ-ఢిల్లీలో మోడి ముందు దోస్తీ అన్నట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. ఇలాంటి పిరికివారు రాష్ట్రానికి అక్కరలేదన్నారు. ఎపి కోసం హోదా కోసం విభజన హామీల కోసం, అభివృద్ధి కోసం, నిధుల కోసం పోరాడే కమ్యూనిస్టులు కావాలని చెప్పారు. దేశంలో ఐక్యత ఉండాలంటే మతోన్మాదాన్ని ఓడించాల్సిందేనన్నారు. ఈ పాదయాత్ర ఈరోజు ఉదయం 61వ డివిజన్‌లో, సాయంత్రం 62, 63, 64 డివిజన్‌లో సాగుతుంది. 23వ తేదీ ఉదయం 29, 27, 28, సాయంత్రం 1వ డివిజన్‌ (మూడు కట్టలు)లోనూ, 25వ ఉదయం 58, 59 జిం3, సాయంత్రం 60, 61 డివిజన్లలోనూ కొనసాగుతుంది. 26వ ఉదయం 30, 32 సాయంత్రం 58వ డివిజన్‌ ఇందిరా నాయక్‌ నగర్‌, 57వ డివిజన్లలో జరుగుతుంది. 27వ ఉదయం 23, 24, 25 డివిజన్లలో సాగుతుంది.

➡️