మద్యానికి బానిసై యువకుడు మృతి

బెల్ట్‌షాపులు తొలగించాలని గ్రామస్తుల ఆందోళన
ప్రజాశక్తి – జీలుగుమిల్లి (ఏలూరు జిల్లా) : మద్యానికి బానిసై అనారోగ్యం పాలైన యువకుడు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పాలచర్ల రాజవరంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన కాకాని వంశీ (24) ఇటీవల కాలంలో మద్యానికి బానిసై బెల్ట్‌షాపుల వద్ద ఫుల్‌గా మద్యం తాగుతూ అనారోగ్యానికి గురయ్యారు. గురువారం రాత్రి మద్యం తాగి పడుకున్న వంశీకి అకస్మాత్తుగా కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన జంగారెడ్డిగూడెంలోని ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఇటీవల కాలంలో బెల్ట్‌షాపులను ఏర్పాటు చేయడంతో పలువురు యువకులు పనికి వెళ్లకుండా మద్యానికి బానిసలవుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీ మృతదేహంతో జీలుగుమిల్లి – మక్కినవారిగూడెం రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, గ్రామంలో బెల్ట్‌ షాపులు మూసివేయాలని నినదించారు. ఘటనా స్థలానికి పోలీసులు, టిడిపి కూటమి పార్టీ నాయకులు చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి గ్రామంలో బెల్ట్‌షాపులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని ఓ ఇంటి వద్ద ఉన్న మధ్యం సీసాలను పగలగొట్టించారు. దీంతో ఆందోళనకారులు శాంతించి వంశీ మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించారు.

➡️