తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించింది. సిఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, వేణుగోపాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే మల్లు రవిని నియమించారు. ఈ నలుగురికీ కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా షబ్బీర్ అలీ వ్యవహరించనున్నారు. ప్రొటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుగా వేణుగోపాల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కసరత్తు పూర్తిచేసింది. దీనిలో భాగంగానే ఇటీవల మహేశ్‌కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌లకు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం కల్పించింది. ప్రభుత్వ సలహాదారుల నియామకం ద్వారా నలుగురు కీలక నేతలకు అవకాశం కల్పించినట్లయింది. ఆర్టీసీ ఛైర్మన్ సహా మరికొన్ని కీలక పదవులకు ఇప్పటికే కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. సిఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చాక వాటిపై స్పష్టత రానుంది.
