నర్సంపేట (వరంగల్) : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉద్రిక్త నెలకొంది. మాదన్నపేట రోడ్డులో ఉన్న త్రిబుల్ వన్ అసైన్డ్ భూమిలో పనులు జరుపుతున్నారంటూ ఓ వర్గం వారిని మరో వర్గం వారు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వాగ్వాదం పెరిగి రాళ్లదాడి చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలవారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 2019లో ఓ మాజీ మిలిటరీ అధికారికి చెందిన భూమిని.. బీఆర్‌ఎస్ కు చెందిన రామస్వామి నాయక్ అతని స్నేహితులు కలిసి నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఎకరం రూ.50 లక్షలు చొప్పున మూడు ఎకరాల భూమికి రూ.కోటి 50 లక్షలు భూయజమానులకు చెల్లించారు. అసైన్డ్ భూమి కావడం.. వివాదం కోర్టులో ఉండటంతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో మిగతా డబ్బులు చెల్లించడానికి ముందుకు రాకపోవడంతో భూ వివాదం అలాగే ఉంది. 2019 నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆ భూమిని కాంగ్రెస్ పార్టీకి చెందిన రామానంద్ అతని స్నేహితులు కలిసి 2024లో భూమిని కొనుగోలు చేశారు. అప్పటినుండి ఈ భూమి కోసం ఇరు వర్గాల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదం కోర్టులో నడుస్తుండగా నేడు ఇరు వర్గాలకు చెందిన కొందరు భూమిలో పనులు జరుపుతున్నారంటూ.. అడ్డుకోవడంతో మళ్లీ రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు.
