ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా

  • 13 మంది మహిళా కార్మికులకు తీవ్ర గాయాలు గాయాలు

ప్రజాశక్తి-పొదిలి (ప్రకాశం జిల్లా) :  ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తాకొట్టిన ఘటనలో 13 మంది వ్యవసాయ కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఒంగోలు-నంద్యాల రాష్ట్ర రహదారిపై మర్రిపూడి మండలం అగ్రహారం గ్రామం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పొదిలి మండలం కాటూరివారిపాలెం గ్రామానికి చెందిన 25 మంది మహిళా కార్మికులు వ్యవసాయ పనుల నిమిత్తం చీమకుర్తి మండలం కంభంపాడు గ్రామం వెళ్లి తిరిగి సాయంత్రం ట్రాక్టర్‌ ఎక్కి ఇంటికి బయలుదేరారు. ట్రాక్టర్‌ ఇంజిన్‌, ట్రక్కు సంబంధించిన చింతకాయ విరిగిపోవడంతో ట్రక్కు అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్రహారం గ్రామస్తులు 108 వాహన సిబ్బందికి సమాచారం అందించడంతో వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మన్నెం పద్మ, డేరంగుల విజయ, వల్లపు ధనలక్ష్మి, నాగాల కల్యాణి, గొబిశం రజిత, బొల్లినేని సుభాషిణిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. వల్లెపు సుమలత, కుంచాల ఆదిలక్ష్మి స్థానిక ఉడుముల వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి : సిపిఎం
ట్రాక్టర్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యవసాయ కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌ కోరారు. ప్రమాదంలో గాయపడి హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా హనీఫ్‌ మాట్లాడుతూ రోజువారీ కూలి పనులు చేసుకుని జీవించే మహిళలు ప్రమాదంలో గాయపడడం బాధాకరమన్నారు.

➡️