రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సహకారం అందించేలా కేంద్ర బడ్జెట్‌

  •  డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సంక్షేమం-సంస్కరణలు సమపాళ్లగా వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారని జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్‌లో స్పందించారు. ఆదాయపు పన్ను మినహాయింపు రూ.12 లక్షలకు పెంచడం ద్వారా మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరటగా నిలుస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు వ్యయ సవరణకు ఆమోదించడమే కాకుండా రూ.5,936 కోట్లను కేటాయించడం, నీటి నిల్వ సామర్ధ్యాన్ని 41.15 మీటర్లకు అనుమతినివ్వడం, బ్యాలెన్స్‌ గ్రాంటు రూ.12,157 కోట్లుగా ప్రకటించడం మంచి పరిణామమన్నారు. పోలవరం అథారిటీకి అదనంగా మరో రూ.54 కోట్లు కేటాయించి పోలవరం నిర్మాణం వేగవంతమయ్యేందుకు సహకరించారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.3,295 కోట్లను కేటాయించడం ద్వారా స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ఎన్‌డిఎ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి రుజువైందన్నారు. విశాఖ పోర్టు అభివృద్ధికి రూ.730 కోట్లు కేటాయింపు ద్వారా పోర్టు సామర్ధ్యం పెంపుతోపాటు వాణిజ్యాభివృద్ధికి దోహదపడనున్నాయన్నారు. వ్యవసాయం, రైతాంగ, పారిశ్రామిక, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఔషధ, విమానయాన, మౌలిక రంగాల్లో సమూల మార్పులు చేస్తూ పేదరికం తగ్గించే దిశగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా బడ్జెట్‌ రూపొందించారన్నారు.

➡️