క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి

  • సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు
  • పలు జిల్లాల్లో సంఘీభావ కార్యక్రమాలు

ప్రజాశక్తి – యంత్రాంగం : క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ . సిఐటియు ఆల్‌ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా కర్నూలు, విజయవాడ, విశాఖలో సంఘీభావ కార్యక్రమం చేపట్టారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబా ప్రజలకు జేజేలు, అమెరికన్‌ సామ్రాజ్యవాదం నశించాలి అని నినదించారు. విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌. నర్సింగరావు మాట్లాడుతూ… 1968లో ఫైడల్‌ కాస్ట్రో, చేగువేరా నేతృత్వంలో లాటిన్‌ అమెరికాలోని క్యూబాలో కార్మిక రాజ్యం ఏర్పడిందన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి పక్కలో బల్లెంలాగా నాటి నుండి నేటి వరకూ పోరాడుతున్న దేశం క్యూబా అని అన్నారు. 1960వ దశకంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్‌ కెనడీ… తమకు 90 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న క్యూబాను సైన్యంతో చుట్టుముడతానని హెచ్చరించారని, దీనిపై క్యూబా అధ్యక్షుడు ఫైడల్‌ కాస్ట్రో స్పందిస్తూ… అమెరికా కూడా తమకు 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంది జాగ్రత్త అంటూ దీటుగా హెచ్చరించారని గుర్తుచేశారు. క్యూబా ప్రజల సోషలిస్టు అంకితభావం ఎంతో ఉన్నతమైనదన్నారు. ఆహార పదార్థాలు, మందులు, నిత్యావసర సరుకులు క్యూబాకు ఎవ్వరూ ఎగుమతి చేయకుండా ప్రపంచ దేశాలపై అమెరికా ఒత్తిడి చేస్తోందని విమర్శించారు. ఆంక్షల ఎత్తివేతకు ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్‌ జరిగినప్పుడల్లా అమెరికాకు వ్యతిరేకంగా ఓటింగ్‌ జరుగుతోందని, కానీ అమెరికా ఆంక్షలు ఎత్తివేయడం లేదని అన్నారు. పాలస్తీనా ప్రజలను ఇజ్రాయిల్‌ సాయంతో పొట్టనపెట్టుకుంటోందన్నారు. మరోవైపు రష్యా చుట్టూ నాటో సైన్యాన్ని మోహరిస్తోందన్నారు. కామ్రేడ్‌ లెనిన్‌ చెప్పినట్లు సామ్రాజ్యవాదం ఉన్నంత కాలం ప్రపంచంలో శాంతి ఉండదన్నారు. సిఐటియు రాష్ట్ర నాయకులు కె.ఉమామహేశ్వరరావు, రమాదేవి, ఆర్‌.వి.నరసింహారావు, కె.ఆర్‌.కెమూర్తి, రైల్వే కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ పూర్ణమార్కెట్‌ స్ప్రింగ్‌రోడ్డులో క్యూబాకు మద్దతుకు సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు. కర్నూలులో గడియారం ఆస్పత్రి వద్ద సంఘీభావం తెలిపారు.

➡️