సిఎంకు లేఖ రాసిన ఎపిజిడబ్ల్యూవియు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని, వేతన బకాయిలు చెల్లించాలని, నెలకు రూ.10 వేల వేతన హామీని అమలు చేయాలని ఎపి గ్రామ, వార్డు వాలంటీర్ల యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు శనివారం లేఖ రాశారు. వాలంటీర్ల సమస్యలపై ఈ నెల 17వ తేదీన విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. వీరి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఎంకు విజ్ఞప్తి చేశారు. వాలంటీర్లకు సంబంధించిన విధి విధానాలను వెంటనే ప్రకటించాలని, బలవంతంగా రాజీనామా చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. డిగ్రీ, పిజి చదివిన వారు కూడా వాలంటీర్లుగా పని చేస్తున్నారని చెప్పారు. కేవలం రూ.5 వేలు గౌరవ వేతనానికి 5 ఏళ్లు పని చేయడానికి లక్షల మంది సిద్దపడ్డారంటే నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వం అర్ధం చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లకు వేతనాలు పెంచకుండా భ్రమల్లోనే చాకిరీ చేయించిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్లకు రూ.10 వేలు వేతనం చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినందున వెంటనే అమలు చేయాలన్నారు. వాలంటీర్లను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనాలు చెల్లించాలని పలు మార్లు కోరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. రెండున్నర లక్షల మంది వాలంటీర్ల కుటుంబాలు గత 9 నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నాయని పేర్కొన్నారు.
