వార్డెన్‌ సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

  • కలెక్టరేట్‌ వద్ద విద్యార్థినుల ధర్నా

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ : ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలోని బిసి హాస్టల్‌ విద్యార్థిని లక్ష్మిపై దాడి కేసులో వార్డెన్‌ పూర్ణపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేయాలని హాస్టల్‌ విద్యార్థినులు కోరారు. ఇదే డిమాండ్‌పై హాస్టల్‌ విద్యార్థినులు కళాశాల ఎదుట శనివారం బైఠాయించారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే గొండు శంకర్‌కు వినతిపత్రం అందజేశారు. అక్కడ్నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి అక్కడ ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్‌ చుట్టూ అనేక లోటుపాట్లు పెట్టుకుని వార్డెన్‌ను బలిపశువును చేయడం సరికాదని, కలెక్టర్‌ ఇచ్చిన సస్పెన్షన్‌ ఉత్తర్వులు రద్దు చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. హాస్టల్‌ విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కళాశాల ప్రహరీ కూలిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు నిర్మించలేదన్నారు. కళాశాల ఆవరణలో ఉన్న నాలుగు మహిళా హాస్టళ్లకు ఎటువంటి రక్షణ వ్యవస్థ లేదన్నారు. కనీసం వీధి దీపాలైనా అమర్చలేదని చెప్పారు. రాత్రిపూట వాచ్‌మెన్‌ లేరని, సిసి కెమెరాలూ లేవని తెలిపారు. మహిళా కళాశాల ఆవరణ మురుగు కూపంగా మారిందని, విద్యుత్తు సమస్యలు పరిష్కరించాలని గతంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ను కోరినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇన్ని లోటుపాట్లు ఉండగా వార్డెన్‌ను బాధ్యురాలిని చేయడం అన్యాయమన్నారు. వెంటనే సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్‌పి కెవి మహేశ్వర రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. కళాశాల ఆవరణలో విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ హామీనిచ్చారు. పాలనా పరమైన అంశాల జోలికి పోకుండా శ్రద్దతో చదువుకోవాలని సూచించారు.

➡️