‘హోదా’ డిమాండ్‌పునరుద్ధరించండి

  • పక్కన పెట్టడం పెద్దతప్పు
  • కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు పోరాటం
  • రాష్ట్రప్రజలు అండగా ఉంటారు
  • ప్రజల ఆదాయాలు పెంచాలి
  • కార్పొరేట్లకు వనరులను అప్పగించొద్దు
  •  సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు
  • రాష్ట్ర మహాసభ నిర్ణయాలు వెల్లడి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్టానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను పునరుద్ధరించాలని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. హోదా ఇస్తే పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చి ప్రజలకు ఉపాధి పెరుగుతుందని వెల్లడించారు. ప్రత్యేకహోదా ఏజెండాను పక్కన పెట్టడమే పెద్ద తప్పని అన్నారు. ఈ నెల 1,2,3 తేదీల్లో నెల్లూరులో జరిగిన సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ నిర్ణయాలను విజయవాడలోని బాల్సోతవ భవన్‌లో బుధవారం ఆయన మీడియాకు వివరించారు. రాష్ట్రానికి హోదా వస్తేనే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని, ఉపాధి కూడా పెరుగుతుందన్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని జెడియు నిరంతరం పోరాటం చేస్తున్నదన్నారు. మన రాష్ట్రానికి రావాల్సిన హోదాను మాత్రం తాకట్టు పెట్టారని విమర్శించారు. చట్టపరంగా రావాల్సిన నిధులు, ప్యాకేజ్‌లను తీసుకురావడం లేదన్నారు. హోదా వస్తే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయని కార్పొరేట్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదన్నారు. ప్రజలపై భారాలు వేస్తే మోయగలిగే పరిస్థితిలో లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాస్తవాలు గుర్తించడాన్ని ఆయన ఆహ్వానించారు. ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయని, భారాలు భరించలేని స్థితిలో లేరనే అంశాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వేతో తేటతెల్లమయిందన్నారు. ఈ అంశాలను తాము గతంలోనే చెప్పామని వివరించారు. ప్రజల ఆదాయాలు పెరిగితేనే ఆర్ధిక వ్యవస్థ ముందుకు వెళుతుందన్నారు. రాయితీలు ఇచ్చి ప్రజల ఆదాయం పెంచే అంశాలను ఆలోచించాలని కోరారు. ప్రభుత్వ ఖాజానా ఖాళీ అయ్యిందని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబుకు ప్రజల అప్పుల్లో ఉన్న సంగతి తెలియదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన విద్యుత్‌ చార్జీల పాపాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల నెత్తిన వేసిందన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా భారాలు మోపారని, ఆ సమయంలో ప్రజలు భరించలేరని తాము చెప్పినా వినలేదన్నారు. ప్రజలపై భారాలు మోపబోమని ఇప్పుడు చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మి రాష్ట్ర ఖజానాను నింపుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసిందని, ఈ నిర్ణయాన్ని తాము సమర్ధించబోమన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై దృష్టిసారించాలని సూచించారు. కేంద్రం ఇప్పటికే రూ.20వేల కోట్ల బకాయి ఉందని, పోలవరం నిర్వాసితులకు నిధులు ఇవ్వాలని తెలిపారు. కాంట్రాక్టరలకు మేలు జరిగేలా పోలవరం ప్రాజెక్టు అంచనాలను సవరిస్తున్న ప్రభుత్వం పునరావాస ప్యాకేజ్‌ను ఎందుకు పెంచడం లేదని నిలదీశారు. 18 ఏళ్లు నిండిన నిర్వాసితులకు ప్యాకేజ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గతేడాది బడ్జెట్‌లో వెనుకబడిన జిల్లాలకు ప్రకటించిన నిధుల్లో ఇప్పటివరకు ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టకుండా రాష్ట్రాన్నిఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం టిడిపి, జెడియులపై ఆధారపడి వుందని ఆంధ్ర, బీహార్‌ రాష్ట్రప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తే తక్షణమే నిధులు వస్తాయని అన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవమే ప్రధాన నినాదంగా ఏర్పాటైన టిడిపి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిందని విమర్శించారు. కేంద్రంతో పోరాడి నిధులు తెచ్చుకునే సంప్రదాయాన్ని ఎన్టీ రామారావు తీసుకొచ్చారని, ఇప్పుడు ఆయన ఉద్దేశాలకే టిడిపి సమాధి కడుతోందని విమర్శించారు. వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజ్‌ ఇవ్వాల్సి ఉందని, రాజధానికి నిధులు ఇవ్వకుండా రూ.12వేల కోట్ల అప్పు కేంద్రం ఇప్పిస్తుందని, ఇది ప్రజలపై పడే భారం కాదా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని పోరాడి తీసుకొస్తేనే రాష్ట్రఅభివృద్ధి వేగంగా పరుగులు తీస్తుందని చెప్పారు. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ను మూసేందుకు మిట్టల్‌ తీసుకొచ్చే ఫ్యాక్టరీ కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారే తప్ప ప్రభుత్వ రంగంలో రావాల్సిన కడప ఉక్కు ఫ్యాక్టరీని అడగటం లేదన్నారు.

8 నెలల్లోనే ప్రభుత్వంపై అసంతృప్తి

టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందని చెప్పారు. వైఎస్‌ జగన్‌ విధానాలను తిరస్కరించి కూటమిపై నమ్మకంతో ప్రజలు గెలిపించారని చెప్పారు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా జగన్‌ విధానాలనే కొనసాగిస్తోందని విమర్శించారు. స్మార్ట్‌మీటర్ల అంశంలో గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా లేదన్నారు. అదానీ కోసం మాజీముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకొచ్చిన మీటర్లను కొనసాగిస్తోందన్నారు. స్మార్ట్‌ మీటర్లను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ మీటర్లు వల్ల అనేక చోట్ల విద్యుత్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయని చెప్పారు. సెకి ఒప్పందంలో అవినీతి జరిగిందని అమెరికాలో విచారణ జరుగుతోందన్నారు. సెకితో ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మొట్టమొదటి సంతకం చేసిన డిఎస్సికి అతీగతి లేదన్నారు. ‘సాల్ట్‌’ అమలు చేయడం ద్వారా ప్రకటించిన పోస్టులకు కూడా కోతలు పెట్టేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. విద్యా విధానాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలను విలీనం చేసి కాంట్రాక్టు లెక్చరర్లను ఇంటికి పంపే ప్రయత్నం జరగుతోందన్నారు. ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేస్తేనే ప్రజల్లో ఉన్న అసంతృప్తి తొలగిపోతుందన్నారు.

స్పష్టత లేని పి4 విధానం

చంద్రబాబు విజన్‌ 2047 పేరుతో తీసుకొచ్చిన పి4 విధానంపై స్పష్టత లేదన్నారు. విజన్‌ 2020 ఫెయిలైందని, మరలా 2047 తీసుకొచ్చారని తెలిపారు. ఉగాది నుంచి అమలు చేస్తామని చెబుతున్న ఈ విధానంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రజల పాత్ర, దీనివల్ల వారికి కలిగే లాభం ఏమిటో చెప్పాలని కోరారు. సమాజపరమైన వనరులు భూమి తదితర ప్రజల ఆస్తులను ప్రైవేట్‌ కంపెనీలకు దోచిపెట్టేందుకు ఈ విధానం తీసుకొచ్చారని అన్నారు. ఉగాది నుండి హడావుడిగా అమలు చేయకుండా దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టడంతో పాటు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరారు. పి4 పేరుతో ప్రజల మాడు పగలగొట్టి ఆస్తులను కార్పొరేట్‌కు అప్పగిస్తామంటే తాము అంగీకరించబోమన్నారు. కమ్యూనిస్టులను మారాలని చెబుతున్న చంద్రబాబు మారుతున్న ప్రపంచాన్ని గుర్తించడం లేదన్నారు. ప్రైవేట్‌ కంపెనీలు దివాళా తీయడంతో అమెరికా,యూరప్‌ వంటి దేశాలు కూడా ప్రభుత్వ రంగాన్ని బలపర్చుకుంటున్నాయని చెప్పారు. ప్రభుత్వ రంగాన్ని బలపర్చుకునే విధంగా చంద్రబాబు విధానాలను మార్చుకోవాలని చెప్పారు. కాలంతో పాటు చంద్రబాబు కూడా మారాలని ఆయన హితవు పలికారు. విజన్‌ 2047 ఆకాశంలో మబ్బులాంటి దని, దానిని చూసి ముంతలో నీటిని పారబోయొద్దన్నారు.

కార్పొరేట్లపై పన్నులు పెంచాలి

రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు కార్పొరేట్లపౖౖె పన్నులు, సెస్సులు పెంచాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వనరులు ఉపయోగించుకుంటున్నప్పుడు డబ్బులు ఎందుకు చెల్లించరని ప్రశ్నించారు.రాష్ట్రంలో ఉన్న బడా కార్పొరేట్లు లక్ష కోట్ల పన్నులు ఎగ్గొట్టారని చెప్పారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో కార్పొరేట్‌ కంపెనీలకు పన్నులు తగ్గిస్తున్నారని తెలిపారు. ఈ విధానం ప్రజలు, రైతులు, నిరుద్యోగులకు అవసరం లేదా అని ప్రశ్నించారు. దావోస్‌ పర్యటనకు వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు. మహారాష్ట్ర, తెలంగాణలతో చేసుకున్న ఒప్పందాలు మన రాష్ట్రంతో ఎందుకు చేసుకోలేదన్నారు. అంతర్జాతీయంగా పెటుబడిదారులు సంక్షోభంలో ఉన్నారని వారి చుట్టూ ప్రభుత్వాలు తిరగడం కాదని, ప్రభుత్వం చుట్టే వాళ్లు తిరగాలని అన్నారు. ప్రజా సమస్యలపై కలిసొచ్చే లౌకిక ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని విశాలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని రాష్ట్రమహాసభలో నిర్ణయించామని చెప్పారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్‌ బాబూరావు, కె ప్రభాకర్‌ రెడ్డి, డి రమాదేవి, వి వెంకటేశ్వర్లు, వి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

➡️