సోషలిజం వైపు ప్రపంచం చూపు

  • సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థ
  • లెనిన్‌ శతవర్ధంతి ముగింపు సభలో వక్తలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో ఉందని, సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. పేదరికం, నిరుద్యోగం, అసమానతలను నిర్మూలించలేకపో యిందన్నారు. ఫలితంగా ప్రపంచం సోషలిజం వైపు చూస్తుందని చెప్పారు. ఇప్పటికే శ్రీలంక, ఉరుగ్వే, బ్రెజిల్‌, కొలంబియా, మెక్సికో, నేపాల్‌లో వామపక్ష పార్టీలు అధికారం చేపట్టాయన్నారు. లెనిన్‌ శతవర్థంతి ముగింపు కార్యక్రమం సందర్భంగా విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రపంచం కమ్యూనిజం వైపు చూస్తుందన్నారు. అమెరికా ఈ రోజు ప్రపంచాన్నంతా ఏలాలని చూసిందని, ఇప్పుడు స్వీయ రక్షణలో పడిందన్నారు. సాంస్కృతిక రంగం కార్పొరేట్‌కు వ్యతిరేకంగా మారిందన్నారు. జైభీమ్‌ సినిమా విజయమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. చంద్రబాబు విజన్‌-2047తో భ్రమలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఇచ్చిన హామీలను ముందుగా అమలు చేసి ఐదేళ్లలో సాధించాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలని కోరారు. విజన్‌ – 2020లో బిపిఎల్‌ కుటుంబాలు 20 శాతం ఉన్నట్లు చెప్పారు. ఇప్పడూ 18 శాతం ఉన్నారని పేర్కొన్నట్లు చెప్పారు. ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయన్నారు. అదాని అశ్వమేధయాగం చేస్తు న్నారని, ఇందుకు మోడీ, అమిత్‌ షా రక్షకులుగా ఉన్నారని చెప్పారు. పి3 విధానంలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేశారని, పి4లో ప్రజల ఆస్తులను కూడా ప్రైవేటుపరం చేస్తారని అన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయిందని, దీంతో మార్కెట్‌లో సరుకులు నిల్వలు పేరుకుపోతున్నా యని, ఆదాయాలు పెంచడమే ఇందుకు పరిష్కా రమని కార్పొరేట్‌ పత్రికల్లో సంపాదకీయాలు ప్రచురించినట్లు తెలిపారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతు తెలిపిన అంతర్జాతీయ నాయకుడు లెనిన్‌ అని చెప్పారు. అదే స్ఫూర్తి దేశంలో సోషలిజం సాధించడానికి తోడ్పడు తుందని పేర్కొన్నారు. వామపక్ష పార్టీలు అన్నీ ఒక వేదికపైకి వచ్చి లెనిన్‌ స్ఫూర్తితో దేశంలో బలమైన కమ్యూనిస్టు ఉద్యమం నిర్మించనున్నట్లు చెప్పారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రపంచంలో పేద, ధనిక తేడా ఉన్నంత వరకూ కమ్యూనిజం ఉంటుందని తెలిపారు. ప్రపంచ శాంతి, పురోగతి మార్క్సిజం, లెనినిజంపై ఆధారపడి ఉంటుందన్నారు. సమసమాజం ఏర్పడినప్పుడే అందరూ ప్రశాంతంగా ఉంటారని తెలిపారు. ధనిక దేశమని చెప్పుకునే అమెరికాలోనూ ఈరోజు పేదరికం ఉందన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు ఎవరూ పాల్గొన లేదన్నారు. సమాజం పురోగతి చెందాలంటే కమ్యూనిస్టుల బలం పెరగాలని, కార్మికుల పోరాటాలు పెరగాలని తెలిపారు. ప్రజా పోరాటాలను లెనిన్‌ స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లను న్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమొక్రసీ నాయకులు పి ప్రసాద్‌, సిపిఐ (ఎంఎల్‌) నాయకులు జాస్తి కిషోర్‌బాబు, ఫార్వార్డ్‌ బ్లాక్‌ నాయకులు పివి సుందరరామరాజు, సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ నాయకులు డి హరినాథ్‌, రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ నాయకులు ఆర్‌ జానకిరాములు, ఎస్‌యుసిఐ నాయకులు అమర్‌నాథ్‌, ఎపి మహిళా సమాఖ్య నాయకులు అక్కినేని వనజ, ఐద్వా నాయకులు కె శ్రీదేవి తదితరులు ప్రసంగించగా, విశాలాంధ్ర బుక్‌ హౌస్‌ మేనేజర్‌ మనోహరనాయుడు అధ్యక్షత వహించారు. అంతకుముందు ప్రజానాట్య మండలి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్య మండలి కళాకారులు ఉద్యమ గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, వై వెంకటేశ్వరరావు, ప్రజాశక్తి బుకహేౌస్‌ మేనేజర్‌ లక్ష్మయ్య, సిపిఐ నాయకులు జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️