ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కులగణనను వైసిపి స్వాగతిస్తోందని, జనగణనతోపాటే కులగణన జరిగితే అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతుందని వైసిపి నేత పోతిన మహేష్ అన్నారు. గురువారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో తొలిసారి కులగణన చేసింది వైసిపి ప్రభుత్వమేనని తెలిపారు. నివేదికను కూటమి ప్రభుత్వం బయటకు రానీయడం లేదని, తక్షణం నివేదికను బయటకు ఇవ్వాలని కోరారు. కులాల వారీగా జనగణన చేపట్టాలన్నా కేంద్ర నిర్ణయాన్ని వైసిపి స్వాగతిస్తోందని పేర్కొన్నారు. 1931లో ఒకసారి కులగణన జరిగిందని, తరువాత చేయలేదని తెలిపారు. దీనివల్ల అన్ని కులాల వారూ సామాజిక, ఆర్థికంగా పురోగతికి అవకాశం ఉంటుందని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు జగన్ కృషి చేశారని తెలిపారు. బిసి కులగణన చేస్తామని 2021లోనే వైసిపి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని పేర్కొన్నారు. 2024లో ఆరుగురు సీనియర్ అధికారులను ఏర్పాటు చేసి కులగణన చేసిందని వివరించారు. కూటమి ప్రభుత్వానికి పేదల పట్ల ప్రేమలేదని, అందువల్లే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు.
